బీర్కూర్లో మన గ్రోమోర్ వద్ద రైతుల ఆందోళన

by Disha Web Desk 15 |
బీర్కూర్లో మన గ్రోమోర్ వద్ద రైతుల ఆందోళన
X

దిశ, బాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రంలో గల మన గ్రోమోర్ కంపెనీ ముందు శుక్రవారం నకిలీ విత్తనాల కొనుగోలు బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతులకు అన్నివిధాలుగా అండగా ఉండాల్సిన మన గ్రోమోర్ కంపెనీ వారిని నిట్టనిలువునా నట్టేట ముంచిందని అన్నారు. రైతులు యాసంగిలో వరి నాట్లు వేసుకునేందుకు గంగాకావేరి వరి వంగడాన్ని ఇవ్వమని కోరగా గ్రోమోర్ కంపెనీవారు కరీంనగర్ కు చెందిన ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేసిన ఆర్ కే సోనా వరి వంగడాన్ని అందజేసి తమ రైతులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గమనించిన రైతులందరూ కలిసి గ్రోమోర్

కంపెనీ మేనేజర్ కు ఈ విషయం తెలపగా తమను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తదనంతరం ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మండల వ్యవసాయ అధికారిణి కమల ఆధ్వర్యంలో అధికారులు క్షేత్ర స్థాయికి వచ్చి తమ పంటలను పరిశీలించారని అన్నారు. మరో రోజు బాన్సువాడ ఏడీఏ వీరస్వామి కూడా విచ్చేసి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఇంతటితో ఆపకుండా శాస్త్రవేత్తలను కూడా పిలిపించి రైతులకు జరిగిన మోసాన్ని వివరించారని పేర్కొన్నారు. ఇంత జరిగినప్పటికీ గ్రోమోర్ కంపెనీ వారు వచ్చి పరిస్థితిని సరిచేయకపోవడంతో ఆగ్రహించి గ్రోమోర్ కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టినట్టు రైతులు పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదని పేర్కొన్నారు.

Next Story

Most Viewed