దేశ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను కాంగ్రెస్ ధ్వంసం చేసింది

by Disha Web Desk 15 |
దేశ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను కాంగ్రెస్  ధ్వంసం చేసింది
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీ గడిచిన 70 సంవత్సరాలలో భారత దేశ చరిత్రను, సంస్కృతిని సాంప్రదాయాలను ధ్వంసం చేసి భ్రష్టు పట్టించిందని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆరోపించారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ధర్మపురి అరవింద్ విలేకరులతో మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఏమి అవసరమో, ఏమి కావాలో అదే చేస్తుందని, గడిచిన రెండు పర్యాయాలు మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజల అభీష్టం మేరకు ప్రజాకర్షక పథకాలే లేకుండా ప్రజలకు ఏమి కావాలో తాము ఐదేళ్లలో ఏమి చేయబోతున్నామో వాటి గురించి మాత్రమే మేనిఫెస్టో బదులు సంకల్ప పత్రాన్ని రూపొందించినట్టు అరవింద్ పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు దొంగ హామీలు

ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని ఎద్దేవా చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిధులు మిగులు ఉండడం అనేది ఎనిమిదవ వండర్ గా అభివర్ణించారు. వాటిని ప్రజల ఆకాంక్షల మేరకు, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఖర్చు చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలే సంబంధిత నిధులను ఖాళీ చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల తరువాత ఈ విషయం హితబోధ కలుగుతుందని, ఎన్నికల్లో ఓడిపోతే ఆయన పదవికి గండం ఉందన్నారు. రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉండడం దరిద్రమన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని సీఎం చేసినందుకు ఆయన ఢిల్లీకి మూటలు మోస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓడిపోయే సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయని, రేవంత్ రెడ్డిని నాయకులే నిలదీస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ, జేపీ నడ్డా ఆధ్వర్యంలో దేశం పురోగమిస్తుందని, వన్ నేషన్ వన్

ఎలక్షన్ అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, అందుకు అనుగుణంగానే సంకల్ప పత్రం ప్రజల అభిప్రాయాల మేరకే తయారు చేశామని, అందులో సలహాలు సూచనలు స్వీకరించిన తర్వాతనే తయారు చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే హిందుత్వంపై ఆ పార్టీ స్టాండ్ ఏమిటో బహిర్గతం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులను పని చేయనివ్వరని, కేవలం అది కుటుంబ పార్టీ అని అన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ పై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని తెలపాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్నంతవరకు రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను రాకుండా కట్టడి చేస్తామన్నారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత నిజామాబాద్ కు పసుపు బోర్డు తెచ్చానన్నారు. నిజామాబాద్ జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలతో పాటు బాసర్, త్రివేణి సంగమం, శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ పై కొత్త ప్రాజెక్టుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పట్లో జైలు నుంచి విడుదల కాదన్నారు. ఇప్పటికే ఈడీ అరెస్టు చేయగా తాజాగా సీబీఐ కూడా అరెస్టు చేసిందని, ఆమెకు బెయిల్ రావడం అన్నది కుదరదని కుండబద్దలు కొట్టారు. లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరెస్టు కావడంతో అది ప్రజల పార్టీ కాదని పాపాల పార్టీగా ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. దేశంలో ఐదేళ్లకు ఒకసారి గ్రామపంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎన్నికలు జరగాలని వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదంతో బీజేపీ పనిచేస్తుందన్నారు. తద్వారా లక్షల కోట్ల ఆదాయం మిగులుతోపాటు నల్లధనం ఉండదని, దేశం ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చెందుతుందని అన్నారు. దేశంలో అవినీతి అక్రమాలను బీజేపీ ఉపేక్షించదని, ప్రధానంగా పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం పై సీరియస్ గా ఉన్నామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తం కాకుండా కఠిన చట్టాలను తయారు చేశామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నిజాంబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed