టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ..

by Disha Web Desk 20 |
టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ..
X

దిశ, ఆర్మూర్ : రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నయం బీజేపీ ఉంటుందని, జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో బీజేపీ టికెట్ల కోసం గట్టిపోటీ ఉందని పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మార్ గార్డెన్ లో బుధవారం ఆలూరు గంగారెడ్డి కుమార్తె విజయభారతి బీజేపీలో చేరిక సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అందరికీ బీజేపీలో చేరడం తప్ప మరోమార్గం లేదన్నారు. 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ సైతం ఉండదన్నారు. ఎంపీ ఎన్నికల ముందు ఆలూరు గంగారెడ్డి దిశ నిర్దేశంతో చెరుకు రైతులతో పాటు సమస్యల సాధన కోసం ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.

ఆలూరు గంగారెడ్డితో మంచి సంబంధాలు ఉండేవని, ఆయన కూతురు విజయ భారతి తన సమక్షంలో పార్టీలో చేరడం అదృష్టం అన్నారు. ఆమె తండ్రి ఆలూరు గంగారెడ్డి సంతోషపడే నిర్ణయం తీసుకొని బీజేపీలో చేరడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఇస్సాపల్లి వద్ద ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టీఆర్ఎస్ గుండాలతో తనపై దాడి చేయిస్తే ఆలూరు గ్రామమే నేడు బీజేపీ బహిరంగ సభకు తరలివచ్చిందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయలేదని విమర్శించారు. రూ 12 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వక, ప్లాట్లు ఉన్నవారికి రూ.3 లక్షలు ఇస్తామని మాయమాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

ఈ డబ్బులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేశారని విమర్శించారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో మామిడిపల్లి, పెర్కిట్ గ్రామాలు విలీనమైనప్పుడు మంజూరైన రూ. 20 కోట్లనిధులు, ఆ తర్వాత 50 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. వందపడకల ఆసుపత్రి 30 పడకల ఆసుపత్రి గానే కొనసాగుతున్నా జీవన్ రెడ్డి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న రూ. 3016 నిరుద్యోగ భృతి హామీ ఏమయిందని ఆయన ప్రశ్నించారు. రైతులకు ఆసరాగా ఉండడానికి స్పైసెస్ బోర్డు మంజూరు చేయిస్తే రైతులతో ఆందోళన చేయిస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికలలో డబుల్ ఇంజన్ సర్కార్ కోసం కమలం పువ్వుకు ఓటు వేసిగెలిపించాలని ఆయన కోరారు.

ఈ సభలో బీజేపీ రాష్ట్రకార్యదర్శి పల్లె గంగారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు లోక భూపతిరెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి అల్జాపూర్ శ్రీనివాస్, జిల్లా మాజీ అధ్యక్షుడు పెద్దొల్ల గంగారెడ్డి, బీజేపీ కిసాన్ అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ పాలెపు రాజు, కౌన్సిలర్లు నరసింహారెడ్డి, సాయి కుమార్, ఎంపీటీసీ సభ్యుడు యాళ్ల రాజ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు జేస్సుఅనిల్, మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed