సంతలో సరుకైన టీఎస్పీఎస్సీ పరీక్ష ప్రశ్నాపత్రాలు : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

by Sumithra |
సంతలో సరుకైన టీఎస్పీఎస్సీ పరీక్ష ప్రశ్నాపత్రాలు : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
X

దిశ, బాన్సువాడ : తెలంగాణ రాష్టంలో టీఎస్పీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రాలు సంతలో సరుకులా మారాయని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. కామారెడ్డి జిల్లా నసుర్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తన తప్పులు కప్పిపుచుకోవడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఐటీ శాఖకు అసలు ఏమాత్రం సంబంధం లేదని కేటీఆర్ అంటున్నారని. లీకేజీని తామే బయటపెట్టామని మంత్రి గంగుల చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. లీకేజీ వ్యవహారం ఇద్దరు వ్యక్తులకు సంబంధించిందని కేటీఆర్ చెప్పారని, అవును.. లీకేజీ వ్యవహారం కేసీఆర్, కేటీఆర్ ఇద్దరికి సంబంధించినదేనని ఆయన ఖరాఖండిగా చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని అన్నిశాఖలు కంప్యూటర్ లు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారానే ఏర్పాటు చేస్తారని, ఇందుకు ఐటీ శాఖ అనుమతులు ఇస్తుందన్నారు. టీఎస్ చైర్మన్ గా 2021లో కేటీఆర్ కె.జగన్ మోహన్ రావును నియమించారన్నారు. రాజశేఖర్ రెడ్డిని ఔట్ సోర్సింగ్ ద్వారా టీఎస్ నియమించిందని, కేటీఆర్ పీఏనే రాజశేఖర్ రెడ్డిని నియమింపజేశారని విమర్శలు చేశారు. 2015లో గంటా చక్రపాణి చైర్మన్ గా ఉండగా కేటీఆర్ టీఎస్ పీఎస్సీని విజిట్ చేశారని, ఐటీ యాక్ట్ 2000 రూల్ 2 ప్రకారం కంప్యూటర్ సెక్యూరిటీ పై ఆడిట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సర్టి ఫై చేసిన ఏజెన్సీని మాత్రమే ఆడిటింగ్ కు పెట్టుకోవాలన్నారు.

చైర్మన్, సెక్రెటరీ, సెక్షన్ ఆఫీసర్ కు మాత్రమే కంప్యూటర్ లో ప్రశ్నాపత్రం తీసుకునేందుకు యాక్సెస్ ఉంటుందని, ఈ ముగ్గురికి తెలియకుండా రాజశేఖర్, ప్రవీణ్ ప్రశ్నాపత్రం హ్యాక్ ఎలా చేయగలిగారని ప్రశ్నించారు. ఐటీ శాఖకు తెలియకుండా, చైర్మన్ కు తెలియకుండా ఎలా బయటకు వచ్చాయని అన్నారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో సెక్షన్ ఆఫీసర్ శంకర లక్ష్మిని ఎందుకు ప్రశ్నిచడం లేదని అడిగారు. బాధ్యత వహించాల్సిన చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రెటరీ అనిత రామచంద్రన్ ను ఎందుకు విచారించలేదని అన్నారు. రాజశేఖర్ రెడ్డి నియామకం వెనక కేటీఆర్, అతని పీఏ తిరుపతి ఉన్నారని ఘంటపదంగా చెప్పుకొచ్చారు. కొత్త జోనల్ వ్యవస్థ పేరుతో 7 జోన్ లుగా విభజించారని, ఏపీ వ్యక్తులకు ఉద్యోగాలు రాకుండా చేస్తానని ప్రగల్భాలు పలికారని అన్నారు.

కానీ నియామకాలు జరిగే టీఎస్ పీఎస్సీ లో ప్రవీణ్ అనే ఆంధ్రావ్యక్తిని నియమించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. 30లక్షల విద్యార్థుల భవిష్యత్ ను నిర్ణయించే అత్యంత కీలక ఉద్యోగంలో ఆంధ్రా వ్యక్తి ప్రవీణ్ కుమార్ ను నియమించారని అన్నారు. అసలు కేసీఆర్ కు సోయి ఉందా ? కేసీఆర్ ది తెలంగాణ రక్తమేనా? అని ఘాటుగా స్పందించారు. టీఎస్ పీఎస్సీ లీకేజీ వ్యవహారానికి కేటీఆర్, కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పారదర్శక విచారణ చేయదని, గతంలో సిట్ అప్పగించిన కేసులన్నీ నిర్వీర్యం అయ్యాయని, ప్రభుత్వం సిట్ వేసిందంటే ఈ నేరాన్ని కాలగర్భంలో కలిపేయడమేనని అన్నారు. గతంలో డ్రగ్స్ కేసు, బోధన్ బియ్యం కేసులలోనూ ఇలాగే జరిగిందని, అందుకే ఈ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని అన్నారు. సిట్ నోటీసులు ఊహించిందేనని, వాటిని స్వాగతిస్తున్నానని తెలిపారు. మమ్మల్ని వేధించాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం నోటీసులు ఇస్తోందన్నారు.

రాజ్యాంగాన్ని గౌరవించి సిట్ నోటీసులకు స్పందిస్తానన్నారు. నా దగ్గర ఉన్నవివరాలను సిట్ దృష్టికి తీసుకెళతానని, సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ ను సూటిగా ప్రశ్నిస్తున్నానని అన్నారు. మంత్రులు ఏ హోదాతో కేసు ఇద్దరు వ్యక్తులకే పరిమితం అని చెప్పారని ప్రశ్నించారు. ఇద్దరికే సంబంధం ఉందని.. కేటీఆర్ చెప్పారు.. ఇక నన్ను ఆధారాలు అడగడం ఎందుకని, ఎవరికేం సంబంధం లేదని చెప్పిన కేటీఆర్ కు కూడా సిట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కు కూడా నోటీసులు ఇవ్వాలని అన్నారు. విచారంగా సంస్థలు విచారణ చేయకుండా ఏ రకంగా జడ్జిమెంట్ ఇచ్చారో చెప్పాలని, కేటీఆర్ కు నోటీసులు ఇవ్వకపోతే.. ఇద్దరం హైకోర్టులో కలుసుకుందామని అన్నారు. పండగపూట నన్ను విచారణకు రమ్మంటున్నారంటే, రాజ్ పాకాల ప్రభావం ఏఆర్ శ్రీనివాస్ పై ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన తేల్చిచెప్పారు.

Next Story