సిరికొండ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకునేనా ?

by Disha Web Desk 20 |
సిరికొండ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకునేనా ?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సిరికొండ మోడల్ పాఠశాల విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖాధికారులు వెనుకంజ వేస్తున్నారు. జనవరి 31 న సిరికొండ మోడల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సభావత్ దినేష్ అనే విద్యార్థిని ఇంచార్జి ప్రిన్సిపాల్ సునీత తీవ్రంగా చితకబాదారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ ను ప్రశ్నించారు. ఆమె చెప్పిన సమాదానంకు సంతృప్తి చెందని తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని మండల కేంద్రంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. సిరికొండ సీఐ విద్యార్థులను సముదాయించి ధర్నా విరమింపజేశారు. విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు సిరికొండ మోడల్ పాఠశాలలో జీసీడీవో వనిత విచారణ చేపట్టారు. విద్యార్థులను, ఉపాధ్యాయులను వేరు వేరుగా విచారణ చేశారు. విద్యార్థులు నుంచి రాతపూర్వకంగా తీసుకున్నారు.

ప్రిన్సిపాల్ సునీత పదవతరగతి విద్యార్థి పిల్లలు కావడంతో చదువులో వెనుకబడి ఉన్నందుకు అందరి పిల్లలను కొట్టినట్లే దినేష్ ను కూడా కొట్టినట్లు తెలిపారు. భయం ఉంచాలనే కొట్టినట్లు అంగీకరించినట్లు తెలిసింది. సిరికొండ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వ్యవహారం జిల్లావిద్యాశాఖలో కలకలం రేపింది. ప్రిన్సిపల్ ఒంటెద్దు పోకడలు అందరికి తెలిసిన తనను ఎవరు ఏమి చేయలేరు అన్న ధీమాతోనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని ఆరోపణలు మూటగట్టుకున్నారు.

పేరుకే ఆదర్శ పాఠశాల ఇంచార్జిగా వ్యవహరిస్తున్న ఎవరికి ఆదర్శంగా ఉండరు అన్నది జగమెరిగిన సత్యం. ఒక్కరు కూడా ప్రిన్సిపాల్ వ్యవహార శైలిని సరిగ్గా ఉందని చెప్పకపోవడం విశేషం. వివాదాస్పద వైఖరిని కలిగిన ప్రిన్సిపాల్ పై జీసీడీఓ, డీఈవో ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వెనుక మతలబు ఏమిటని చర్చ మొదలైంది.

జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు జీసీడీఓ వనిత విచారణ జరిపించారు. అయితే విచారణ నివేదికను ఆర్జేడికి సమర్పించి జిల్లా విద్యాశాఖ చేతులు దులుపుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ జరిపి నెల రోజులు గడుస్తున్నా ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటోని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రిన్సిపాల్ సునీత సస్పెన్షన్ కాకుండా అడ్డుకుంటున్నా వారు ఎవరనే ప్రచారం జోరందుకుంది. విద్యాశాఖలో విచారణ జరిపే ఒక అధికారి నివేదిక తర్వాత తీసుకోలేరు అని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కేజీబీవీలలో అవినీతి అక్రమాలు జరిగిన వారిని వెనకేసుకు రావడంలో జిల్లా అధికారులకు వెన్నతో పెట్టిన విద్య. విచారణ తర్వాత చర్యలు తీసుకోకుండా ఎక్కడికక్కడ యూనియన్ లీడర్లతో సర్దుబాట్లు చేసుకుంటారని ఆరోపణలను విద్యాశాఖ మూటగట్టుకుంది.

Next Story

Most Viewed