నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి నామినేష‌న్ల జాతర

by Disha Web Desk 12 |
నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి నామినేష‌న్ల జాతర
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు నామినేషన్ల సమయంలో రాజకీయం సెగలు పుట్టిస్తున్నాయి. నామినేషన్ ల పర్వం ప్రధానంగా రాజకీయ పార్టీలలో ఉత్కంఠను పెంచుతున్నాయి.ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభమైన మూడు రోజుల్లోనే 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో రెండు ప్రధాన రాజకీయ పక్షాలు కాగా మిగిలిన 10 మంది స్వతంత్రులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ తో పాటు దేశంలోని జాతీయ పార్టీల నుంచి ఇంకా నామినేషన్ల దాఖలు కాలేదు. సోమవారం కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అందరి చూపు ఈ సారి కూడా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పైన ఉంది.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో దేశం మొత్తం నిజామాబాద్ వైపు చూసింది. ఎందుకంటే అప్పుడు 185 మంది నిజామాబాద్ ఎంపీ స్థానం కోసం బరిలో ఉండటమే కారణం.. ఇందులో 175 మంది రైతులకు పసుపు బోర్డు కోసం నామినేషన్లు దాఖలు చేయడంతో ఎలక్షన్ కమిషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈవీఎంల ద్వారా నిర్వహించి ఔరా అనిపించింది. తాజాగా 2024 పార్లమెంట్ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజుల్లో 12 మంది 16 సెట్ల నామినేషన్ వేయడంతో ఈ నెల 25 వరకు మరి ఎంత మంది నామినేషన్లు వేస్తారో అని చర్చ జరుగుతుంది.

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఈ సారీ చెరుకు రైతులు, గల్ఫ్ కార్మికుల పక్షాన నామినేషన్లు దాఖలు అవుతాయని అంచనా ఉంది. ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లా వారే అధికంగా ఉండగా ఒకే ఒక్క నామినేషన్ జగిత్యాల జిల్లా రాయికల్ కు చెందిన విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున యువకుడు దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లా నుంచి లా చదువుతున్న విద్యార్థి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. గతంలో పార్లమెంట్ కు పోటీ చేసిన స్వతంత్రులు ఈ సారి కూడా నామినేషన్‌లను దాఖలు చేసి పోటిలో ఉంటామని ప్రకటించారు.

ఇప్పటి వరకు 12 మంది తమ నామినేషన్లు సమర్పించగా నామినేషన్లను ఉపసంహరించుకోవడం పూర్తయిన తర్వాత కానీ బరిలో ఎంతమంది ఉంటారు అనేది తేలనుంది. 16 మంది అభ్యర్థులు ఒక్క ఈవీఎం సరిపోతుందని నామినేషన్ల చివరాఖరి వరకు ఎంత మంది నామినేషన్లు వేశారనే చర్చ జరుగుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల కోసం ఎంతమంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు వేచి చూడాలి.నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఈసారి ముక్కోణపు పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ముక్కోణపు పోటీ అనివార్యం అని చెప్పాలి. సిట్టింగ్ స్థానం కాపాడుకునేందుకు బీజేపీ, దశాబ్దం తర్వాత కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు చేయి గుర్తు పార్టీ, పూర్వ వైభవం కోసం బీఆర్ఎస్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

ఇద్దరు రాజకీయ ఉద్ధండులు, ఒక యంగ్ డైనమిక్ లీడర్ మధ్య జరుగుతున్న పోటీ నేపథ్యంలో నామినేషన్ల పర్వం పూర్తి కాకముందే రాజకీయ పక్షాలు ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇప్పటికే కుల, యువజన, సామాజిక వర్గాల వారీగా ఓట్లు కొల్లగొట్టే పనులు చేస్తున్నాయి. ఇప్పటికే మీటింగ్ లతో పాటు ఇంటింటి ప్రచారం జోరుగా జరుగుతోంది. స్వతంత్ర అభ్యర్థులు, చిన్న రాజకీయ పార్టీల హడావుడి కనిపించడం లేదు కానీ ప్రధాన పార్టీల రాజకీయం జోరందుకుంది. పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 నియోజకవర్గాలు ఉండగా గ్రామ గల్లి స్థాయి వెళ్లే వీలు లేకపోవడంతో ఒకటి నుంచి రెండు మూడు మండలాల కార్యకర్తల సమావేశాలు జరగుతుంది. ఇక సోషల్ మీడియా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది.

పార్లమెంట్ ఎన్నికల వేళ నజరానాలతో పాటు బహుమతులు, దావత్ లకు లీడర్ల చేతి చమురే వదులుతోంది. ఒక్క నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 16 నుంచి ఆదివారం వరకు రూ.71,38,707 లనగధు, రూ.13,15,402 విలువైన మద్యం, లక్ష 19 వేల విలువైన నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, నిజామాబాద్ నగరంలో లెక్కలో లేని రూ.28 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వచ్చే నెల 13న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఎంత మందు, నగదు పట్టు పడుతుందో అని చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా ఈ సారి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గతంలో మాదిరిగా ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా తనిఖీలు, ఎన్నికల అధికారుల హడావుడి లేదని చెప్పాలి.



Next Story

Most Viewed