మావోయిస్టు నేతపై ఎన్ఐఏ రూ.10లక్షల రివార్డు

by Disha Web Desk 4 |
మావోయిస్టు నేతపై ఎన్ఐఏ రూ.10లక్షల రివార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మావోయిస్ట్ కీలక నేతలపై నజర్ వేసింది. మావోయిస్ట్ నేతపై ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) రివార్డు ప్రకటించింది. మావోయిస్ట్ నేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్‌ని ఎన్ఐఏ టార్గెట్ చేసింది. గాజర్ల రవిని పట్టిస్తే రూ.10లక్షల రివార్డు ఇస్తామని తెలిపింది. ఈ మేరకు ఏవోబీలో పోస్టర్లను ఎన్ఐఏ అంటించింది. కాగా గాజర్ల రవిది స్వగ్రామం భూపాలపల్లి జిల్లా వెలిశాల. ఆయన ఆచూకీ చెప్పిన వారికి ఈ మొత్తం ఇస్తామని ఎన్ఐఏ వెల్లడించింది.

ఒడిశా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లాలో 2012 ఫిబ్రవరి 10న బీఎస్ఎఫ్ జవాన్లపై జరిగిన దాడి కేసులో ఎన్ఐఏ ఈ రివార్డు ప్రకటించింది. గాజర్ల రవితో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జాలమూరి శ్రీను, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరు జోగా అలియాస్ టెక్ శంకర్ లపై రూ.5లక్షలు, మల్కన్ గిరికి చెందిన చంటి తలపై రూ. 3లక్షల రివార్డు ప్రకటించింది. ఈ నలుగురిలో ముగ్గురు ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది.

ఈ నేపథ్యంలో ఒడిశాలోని కోరాపుట్, మల్కన్ గిరి, చిత్రకొండ తదితర ప్రాంతాల్లో తాజాగా ఎన్ఐఏ పోస్టర్లు అంటించింది. మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న గాజర్ల రవి ప్రస్తుతం కేంద్ర కమిటీలో కొనసాగుతూ ఏవోబీ‌ఎస్‌జడ్‌సీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఏపీ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దులతో కూడిన ఏవోబీఎస్‌జడ్‌సీని ట్రై జంక్షన్‌గా వ్యవహరిస్తారు. దట్టమైన అడవులతో కూడిన ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు ఆయా రాష్ట్రాల్లోకి రాకపోకలు సాగించేందుకు కీలకంగా భావిస్తారు. ఈ ప్రాంతంలో గట్టి పట్టున్న రవిపై ఎన్ఐఏ దృష్టి సారించి రివార్డు ప్రకటించింది.


Next Story

Most Viewed