గజ్వేలా.. కామారెడ్డా.. KCR కొనసాగేది ఎక్కడ.. 2 చోట్ల గెలిస్తే ఆ నియోజకవర్గానికి రాజీనామా..?

by Disha Web Desk 19 |
గజ్వేలా.. కామారెడ్డా.. KCR కొనసాగేది ఎక్కడ.. 2 చోట్ల గెలిస్తే ఆ నియోజకవర్గానికి రాజీనామా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈసారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్లస్సా?.. మైనస్సా?.. ఈ చర్చ జాబితా విడుదల చేసిన తర్వాత కొన్ని రోజులుగా పాటు తీవ్ర స్థాయిలో జరిగింది. తాజాగా గజ్వేల్ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి వారిని కన్విన్స్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సొంత నియోజకవర్గ నేతలను సంతృప్తిపర్చే సంగతెలా ఉన్నా కామారెడ్డి ఓటర్లలో మాత్రం కన్‌ప్యూజన్‌కు కారణమైంది. రెండు చోట్లా గెలిస్తే కేసీఆర్ ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు?.. ఏ సెగ్మెంట్‌ను వదులుకుంటారనే కొత్త చర్చ మొదలైంది. గజ్వేల్‌ను వదలిపెట్టనని, నెలకోసారి వచ్చి అభివృద్ధి పనులపై సమీక్ష చేస్తానని ఈ సమావేశంలో కేసీఆర్ హామీ ఇచ్చారు.

గజ్వేల్ లోకల్ లీడర్లకు ఈ హామీ ద్వారా కేసీఆర్ భరోసా కల్పించారు. కానీ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తుండడంతో గెలిచినా ఈ స్థానాన్ని వదులుకుంటారన్న మెసేజ్ అక్కడి ఓటర్లకు వెళ్ళిపోయింది. గెలిచిన తర్వాత ఖాళీ చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఇక ఎన్నుకుని ప్రయోజనమేముందనే చర్చ మొదలైంది. గజ్వేల్ ఓటర్లను సంతృప్తిపర్చడానికి కేసీఆర్ తాజా సమావేశంలో హామీ ఇచ్చినా అది కామారెడ్డిలో నెగెటివ్ కావడానికి కారణమైంది.

కామారెడ్డిలో వచ్చే నెల 9న నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలనుకుంటున్నారు. ఆ సమయంలో కామారెడ్డి ఓటర్లకు ఏం హామీ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కామారెడ్డికే ప్రాతినిధ్యం వహిస్తానని హామీ ఇస్తే గజ్వేల్ ఓటర్లకు ఇచ్చిన హామీపై మరో రకమైన చర్చకు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది.

గజ్వేల్ లీడర్లకు కేసీఆర్ చెప్పిందేంటి..?

గజ్వేల్‌ను నేను వదిలిపెట్టి పోయే ప్రసక్తే లేదు.. నన్ను రెండుసార్లు గుండెల్లో పెట్టుకుని గెలిపించారు.. కొన్ని అభివృద్ధి పనులు కంప్లీట్ అయ్యాయి.. ఇంకొన్ని మిగిలి ఉన్నాయి.. ఇకపై ప్రతి నెలా ఒక రోజు కేటాయిస్తా.. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితుల సమస్యలను అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తా.. వారం పది రోజుల్లోనే అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష జరిపి ఆదేశాలు జారీచేస్తా.. సీఎం హోదాలో తొలి మీటింగ్‌ను ఈ హాల్‌లోనే ఏర్పాటు చేసుకుందాం.. గజ్వేల్‌ను రాష్ట్రానికే తలమానికంగా చేసుకుందాం.. అంటూ లోకల్ లీడర్లకు హామీ ఇచ్చారు. గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అంటూ నిర్దిష్టంగా చెప్పకుండా దాటవేశారు.

కామారెడ్డి ఓటర్లకు ఇచ్చే క్లారిటీ ఏంటి..?

గజ్వేల్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. అని అక్కడి లోకల్ లీడర్లకు హామీ ఇచ్చి కామారెడ్డి ఓటర్లలో డైలమాలోకి నెట్టారు. గెలిచిన తర్వాత కామారెడ్డిని వదిలిపెట్టడం ఖాయమనే ఆయన మాటల ద్వారా వ్యక్తమైనందున ఓటు వేసి ప్రయోజనం ఏంటనే కొత్త చర్చకు తెర లేపినట్లయింది. కేసీఆర్‌కు ఓటు వేసి గెలిపించుకోవడమా?.. లేక ఇక్కడ ఉండనప్పుడు ఓటు వేసి ఉపయోగమేంటి?.. ఈ స్థానాన్ని ఖాళీచేసి వెళ్ళిపోతారని తెలిసి కూడా ఆయనను గెలిపించుకోవడంతో ఒనగూరేదేంటి?.. ఇవీ ఇప్పుడు కామారెడ్డి ఓటర్ల మధ్య నలుగుతున్న చర్చలు. గజ్వేల్ తరహాలో అభివృద్ధి చెందుతుందనే ఆశతో గెలిపిద్దామనుకున్న ఓటర్లకు కేసీఆర్ తాజా వ్యాఖ్యలు గందరగోళాన్ని రేకెత్తించాయి.

వ్యూహాత్మకంగానే కేసీఆర్ కామెంట్లు..?

గజ్వేల్ లోకల్ లీడర్లతో కేసీఆర్ చేసిన కామెంట్లు వ్యూహాత్మకమా?.. లేక సెల్ఫ్ గోల్ చేసుకున్నారా?.. అనే చర్చలు మొదలయ్యాయి. నన్ను ఎంత మెజారిటీతో గెలిపిస్తారనేది మీ దయ.. అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు గెలుపుపై కాన్ఫిడెన్స్ కోల్పోయారన్నదానికి నిదర్శనమా?.. లేక నియోజకవర్గ స్థాయి లీడర్లలో అసంతృప్తి ఉన్నందున గతంలో వచ్చినంత మార్జిన్ ఈసారి రాకపోవచ్చనే అనుమానమా?.. ఇలాంటి కొత్త చర్చలకు దారితీసినట్లయింది. గజ్వేల్‌ను విడిచిపెట్టనని నియోజకవర్గ ఓటర్లకు భరోసా కల్పించే సంగతెలా ఉన్నా ఫస్ట్ ఎటెంప్ట్‌లో కామారెడ్డి ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.




Next Story

Most Viewed