గ్యాస్ ధరకి ఉన్న విలువ పిల్లల జీవితాలకు లేదా మేడం..? మంత్రి సబితా తీరుపై నెటిజన్ల ఫైర్

by Disha Web Desk 19 |
గ్యాస్ ధరకి ఉన్న విలువ పిల్లల జీవితాలకు లేదా మేడం..? మంత్రి సబితా తీరుపై నెటిజన్ల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రికి విద్యార్థుల సమస్యల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయా అని నిలదీస్తున్నారు. మంత్రి సబితాపై ఇంతలా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏంటటే.. ఇటీవల రాష్ట్రంలో పలు చోట్ల విద్యార్థుల ఆత్మహత్యలు సంచలనంగా మారుతున్నాయి. హైదరాబాద్‌లోని నార్సింగ్ శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటన మరిచిపోకముందే మహబూబ్ నగర్ జిల్లాలోని మణికొండలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి శివకుమార్ సూసైడ్ చేసుకున్నాడు. అంతకు ముందు మెడికో స్టూడెంట్ ప్రీతి ఘటన మురువక ముందే వరంగల్ జిల్లాలో రక్షిత అనే 20 ఏళ్ల ఇంజినీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

వీరి ఆత్మహత్యల వెనుక యాజమాన్యాల ఒత్తిళ్లు, ర్యాగింగ్ వేధింపులు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ కారణాలతో రాష్ట్రంలో నిత్యం విద్యార్థులు ఇలా పిట్టల్లా రాలుతూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా సబితా ఇంద్రారెడ్డి తన శాఖ పరిధిలోకి వచ్చే విద్యా సంస్థల్లో ఇలాంటి దారుణాలను ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలతో పాటు పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. విద్యార్థులు చనిపోతే స్పందించలేని విద్యాశాఖ మంత్రి సబితా గ్యాస్ ధరల పెరుగుదలపై పార్టీ ఇచ్చిన నిరసన కార్యక్రమంలో మాత్రం కట్టెలు నెత్తిన ఎత్తుకుని రోడ్డు ఎక్కిందంటూ నిలదీస్తున్నారు.

అయితే సాత్విక్ ఆత్మహత్య ఘటనపై మంత్రి విచారణకు ఆదేశించారు. గ్యాస్ ధరకు ఉన్న విలువ మా పిల్లల జీవితాలకు లేవా మేడం అని ప్రశ్నిస్తున్నారు. నెటిజన్లు చేస్తున్న పోస్టులపై బాలల హక్కుల సంఘం సైతం స్పందించింది. మంత్రి సబితా వ్యవహారం సిగ్గుచేటు అని విమర్శించింది. విద్యార్థులు చనిపోతే విద్యాశాఖ మంత్రికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని.. గ్యాస్ ధర పెంపుకు ఆమెకు ఏం సంబంధం అని ప్రశ్నించింది. ఇక వీళ్లు ప్రజా ప్రతినిధులు కాదని దొర గడీలో బానిసలు అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.



Next Story