ఆ నెల తర్వాత తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు: నల్లు ఇంద్రసేనారెడ్డి

by Disha Web Desk 19 |
ఆ నెల తర్వాత తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు: నల్లు ఇంద్రసేనారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇది ఎన్నికల ఏడాదని, తెలంగాణలో సెప్టెంబర్ తర్వాత అంటే ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్‌లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామో రామో అనే భయం బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోందని, అందుకే తండ్రీ కొడుకులు కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని నల్లు ఫైరయ్యారు. ప్రధాని మోడీపై కూడా వారికి నోటికి వచ్చింది వాగుతున్నారని ధ్వజమెత్తారు. ఫ్లై ఓవర్ నిర్మాణం విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని, దొంగల్లాగా వచ్చి రాత్రికి రాత్రి పోస్టర్లు వేస్తారా అని విరుచుకుపడ్డారు.

ఫ్లైఓవర్ నిర్మాణం ఎందుకు ఆలస్యమవుతుందనే అంశంపై కారణాలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే భారత రోడ్డు రవాణ, హైవేల మంత్రిత్వ శాఖ లేఖ రాసిందని తెలిపారు. త్వరగా పూర్తిచేసేందుకు సహకరించాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు చేశారు. మంత్రి కేటీఆర్ ఆ లేఖ చూసి అయినా కేంద్రం ఆలస్యం చేస్తోందా? రాష్ట్ర ప్రభుత్వమా? అనేది సమాధానం చెప్పాలని నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు.

మెట్రో విస్తరణకు ఫిజిబులిటీ లేదని కేంద్రం రద్దు చేసిందని కేటీఆర్ మరో అబద్ధం చెప్పడంపై ఆయన తప్పుబట్టారు. కేంద్రం మెట్రో విస్తరణ రద్దు చేసినట్లు కేంద్రం పంపిన కాపీ ఏమైనా ఆయన వద్ద ఉందా చూపించాలన్నారు. ఇప్పటికే నిర్మించుకోవచ్చు అని అనుమతులిచ్చాక కూడా ఓల్డ్ సిటీకి మెట్రో ఎందుకు వేయడం లేదో సమాధానం చెప్పాలని నల్లు డిమాండ్ చేశారు. హైవేలపై ఉన్న అన్యమతస్తులకు సంబంధించిన ప్రార్థన మందిరాలను ఆయా మతస్థులు, స్థానికులతో మాట్లాడి ఒప్పించి నిర్మాణాలు పూర్తిచేయాలని ఆయన సూచించారు.

Next Story

Most Viewed