ఫనిగిరి గుహలో అతి చిన్న పార్వతి శిల్పం

by Disha Web Desk 11 |
ఫనిగిరి గుహలో అతి చిన్న పార్వతి శిల్పం
X

దిశ,తుంగతుర్తి: చరిత్ర పరిశోధకులు రత్నాకర్ రెడ్డి శుక్రవారం సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని ఫనిగిరి గ్రామ గుట్టపై పురావస్తు శాఖ జరుపుతున్న త్రవ్వకాలను సందర్శించారు. ఈ క్రమంలో గుట్ట ఎక్కేముందు ఒక చిన్న గుహలో పార్వతి దేవి శిల్పాన్ని ఆయన గుర్తించారు.ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ… దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గుట్ట మధ్య నుండి రామాలయం వెళ్లే దిశలో సుమారుగా 15 అడుగుల ఎత్తులో ఒక గుహ ఉందని స్థానికులు దాన్ని ”నక్కల గుహ"గా పిలుస్తారని తెలిపారు. అయితే గుహ 6 ఫీట్ల పొడవు, వెడల్పుతో 4 ఫీట్ల ఎత్తు కలిగి ఉందని దీన్ని ఎక్కేందుకు పాదాల కొన భాగం పట్టేంత భాగమే తొలిచారని తెలిపారు.

గుహలో ఒక దీర్ఘ చతరస్రాకారంలో రెండు ఇంచుల లోతు తొలిచిన పానమట్టం,మద్యలో ఉబ్బెత్తుగా తొలిచిన రెండు శివలింగాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇలా మొత్తంగా 5 జంట శివ లింగాలు ఉన్నాయని, విడిగా ఒకటి మాత్రమే ఉందని తెలిపారు. అభిషేకించిన నీరు గుహ లోపలే చిన్న రంధ్రంలోకి చేరి అక్కడి నుంచి బయటకు వచ్చేలా శిల్పులు తొలిచినట్లు తెలిపారు. ముఖ్యంగా ఆకర్షణీయంగా ఉన్న గుహ లోపల వెనుక భాగం కింది వైపున ఆసీనురాలైన 4 ఇంచుల ఎత్తైన దేవతా శిల్పం చెక్కి ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ శిల్పం పార్వతీ దేవిగా ఉండవచ్చు అంటూ తెలిపారు.

గుహ మొత్తం ఒకప్పుడు మందంగా వేసిన డంగు సున్నం పూతతో ఎర్రని రంగు గీతలు లేదా చిత్రాలతో అలంకరించి ఉన్నట్లు తెలుస్తుందని ఆయన తెలిపారు. గుహ పక్క నుండి తొలిచిన చిన్న దిగుల్ల సహాయంతో వెళితే మరొక ఆసక్తికరమైన శిల్పం ఉండగా దీన్ని పూర్తిగా చెక్కకుండ వదిలేశారని తెలిపారు. ఇది భైరవ శిల్పమై ఉంటుందంటూ అనుమానం వ్యక్తం చేశారు. కాకతీయుల కాలంలో శైవ మత ప్రాబల్యం కారణంగా ఫనిగిరి గుట్టపై శివాలయం నిర్మించబడిందని, ఈ మేరకు గుహలో తొలిచిన శివ లింగాలు, పార్వతి దేవి, భైరవ శిల్పం పూజలు అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed