అలసిపోయి ఆపితే అందినకాడికి దోపిడీ.. హడల్ పుట్టిస్తోన్న హైవేపై ప్రయాణం

by srinivas |
అలసిపోయి ఆపితే అందినకాడికి దోపిడీ.. హడల్ పుట్టిస్తోన్న హైవేపై ప్రయాణం
X

దిశ, నార్కట్‌పల్లి: హైదరాబాద్-విజయవాడ హైవేపై దారి దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. హైవేపై దొంగతనాలు రోజు జరగుతున్నాయి. రాత్రి పూట ప్రయాణించే వారు భయపడుతున్నారు. జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రయాణించాలంటే.. ప్రాణాలు అరచేతి పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత నెల 18వ తేదీన హైదరాబాదులో సరుకును దిగుమతి చేసుకొని తిరుగు ప్రయాణంలో కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద అలసిపోయి తన వాహనాన్ని పార్కింగ్ చేసుకొని నిద్రిస్తున్నాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తాళ్లతో కట్టేసి గొంతు నలిపి హత్య చేసి రోడ్డు పక్కన పడేసి పారిపోయారు. ఈనెల 1వ తేదీన నార్కట్ పల్లి మండలం లింగోటం వద్ద లారీని ఇద్దరు మహిళలు ఆపారు. ఆ సమయంలో మరో ఇద్దరు మగ వ్యక్తులు వచ్చి కింద పడేసి తాళ్లతో కట్టేసి విపరీతంగా కొట్టి లారీలో ఉన్నటువంటి 22 వేల రూపాయల నగదును దోచుకెళ్లారు.

ఈనెల 9వ తేదీన ఏపీ నుంచి హైదరాబాద్ వెళుతున్న తూర్పుగోదావరి జిల్లా వాసులు ప్రయాణంలో అలసిపోయి చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద కారును ఆపి నిద్రిస్తున్నారు. నిద్రిస్తున్న వారిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి వారి వద్ద నుంచి పది తులాల బంగారాన్ని అపహరించుకున్నారు. తాజాగా ఈనెల 22వ తేదీన చౌటుప్పల్ మండలం మల్కాపురం పరిధిలోని స్వాతి దాబా వద్ద ఓ వ్యక్తి కారులో విరామం తీసుకుంటున్నారు. కారులో ఉన్నటువంటి రెండు లక్షల రూపాయల నగదును దొంగలించికెళ్లారు.

పై ఉదాహరణలు పరిశీలిస్తే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై దోపిడీలు, హత్యలు ఏ విధంగా జరుగుతున్నాయో ఇట్టే అర్థమవుతుంది. ప్రయాణంలో అలసిపోయి కాసింత విరామం తీసుకుందామంటే ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ దారిలో ప్రయాణించే ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. కనీసం విరామం తీసుకునేందుకు సాహసించలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. పార్కింగ్ చేసిన వాహనదారుల నుంచి నగదు, బంగారం దోపిడీని కొందరు చేస్తుంటే, మరొక ముఠా తాళ్లతో కట్టేసి విపరీతంగా కొట్టి ఉన్నటువంటి నగదును దోచుకెళ్తున్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట ఈ ఘటనలు జరగడం పరిపాటిగా మారింది. ఇంత భయానకరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్న పోలీసులు వారిని పసిగట్టలేకపోతున్నారు. గత నెల రోజులుగా జరిగిన దోపిడీల్లో ఏ ఒక్క కేసును ఛేదించలేకపోయారు.

నిఘా నిద్దరోతోందా...?

జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు, దోపిడీలు, హత్యలు జరుగుతున్న నిఘా కళ్లు ఏం చేస్తున్నాయి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం పోలీస్ వ్యవస్థలో ఎక్కడ ఏమి జరిగిన వెంటనే ఆచూకీ పసిగట్టేంత నెట్వర్క్ తమ వద్ద ఉంది. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న నిందితులను పట్టుకోకపోవడం వెనక కారణం ఏంటనేది తెలియ రావడం లేదు. వేరువేరు ప్రాంతాల్లో ఘటనలు చోటు చేసుకోవడం వల్ల పెద్దగా వీటిపై పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు పోలీసులు రాత్రి పూట చేయాల్సిన పెట్రోలింగ్ పై నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని అపవాద మూటగట్టుకుంటున్నారు.

వారి నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణాలు అనే విధంగా తెలుస్తోంది. దీనికి తోడు రోడ్డు కాంట్రాక్టర్ సిబ్బంది సైతం పెట్రోలింగ్ చేయాల్సి ఉంది. ఎక్కడైనా ప్రమాదాలు చోటు చేసుకుంటే ట్రాఫిక్ జామ్ కాకుండా వెంటనే ట్రాఫిక్ ని క్లియర్ చేయాల్సిన పరిస్థితి వారిది. గంటల తరబడి ప్రమాదాలు చోటుచేసుకున్న దగ్గరికి రాకుండా ట్రాఫిక్ అంతరాయంతో ప్రయాణికులకు ఇబ్బందులు జరుగుతున్నాయి. అదేవిధంగా పార్కింగ్ చేసిన వాహనాలను వీరు పట్టించుకోకుండా వదిలేయడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పొచ్చు.

వారిపై చర్యలేవి...!

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎక్కడో ఒకచోట గ్రామ శివారులో చెట్ల వెనకాల నుంచి టార్చిలైట్లు వేసి వేశ్యలు వాహనదారులను పిలుస్తుంటారు. ఇదంతా పోలీసులకు రోడ్డు కాంట్రాక్టర్ సంస్థకు తెలుసు. అయినప్పటికీ వారిపై పెద్దగా చర్యలు తీసుకోకపోవడం వల్లే కొన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ దోపిడీలు, హత్యలు జరిగే సమయంలో వారిదేమైన పాత్ర ఉందనే కోణంలో కూడా పోలీసులు ఆలోచించాల్సి ఉంది. వీటన్నింటినీ పరిశీలిస్తే సరైన నిఘ లేకపోవడమే వీటన్నింటికీ కారణంగా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ నిందితుల ఆచూకీ కనిపెట్టే వరకు పోలీసులకు ఇది పెద్ద సవాలు గానే మారింది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పి దీనిపై దృష్టి సారించి వెంటనే నిందితులను పట్టుకొని శిక్షించాలి అని బాధితులు కోరుతున్నారు. దీనికి తోడు జాతీయ రహదారిపై పెట్రోలింగ్ కట్టదిట్టంగా చేయాల్సిన అవసరం ఉన్నది.

Advertisement

Next Story