యాదాద్రి ఆలయంలో రాములోరి కళ్యాణం

by Disha Web Desk 15 |
యాదాద్రి ఆలయంలో రాములోరి కళ్యాణం
X

దిశ, యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని శివాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మొదట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు, అనంతరం సీతారాముల ఉత్సవమూర్తులను కళ్యాణ మండపంలో అధిష్టింపజేసి సీతారాములను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పెళ్లికొడుకు, పెళ్లికూతురు వేషధారణలో,

వజ్రవైఢూర్యాలతో సీతారాములు దగదగ మెరిసిపోయారు. సరిగ్గా ఉదయం 12 గంటలకు మొదలైన సీతారాముల కళ్యాణ తంతు దాదాపు రెండు గంటలపాటు కొనసాగింది. కల్యాణ ఘడియ సమీపించగానే సీతమ్మవారి మెడలో శ్రీరాముడు మాంగళ్యధారణ గావించారు. లోకకల్యాణం కోసం శ్రీరాముడు సీతమ్మను పెళ్లాడి ఆదర్శ దంపతులుగా వర్ధిల్లారని వేదపండితులు ప్రవచించారు. కళ్యాణ తంతు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ, తలంబ్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్​ శరత్ ,ఆలయ ఈవో భాస్కర్ రావు, ఆలయ అనువంశిక చైర్మన్ బి. నరసింహమూర్తి, ఆలయ అధికారులు, డీఈవో భాస్కర్ శర్మ, రామ్మోహన్ రావు, రాజన్ బాబు, పాల్గొన్నారు.

Next Story

Most Viewed