రానున్న ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి " కీ " రోల్

by Disha Web Desk 9 |
రానున్న ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి  కీ  రోల్
X

దిశ, నల్గొండ బ్యూరో: దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తోంది. చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. రాష్ట్రంలో కూడా బీజేపీ జోష్ కనిపిస్తుంది. నల్లగొండ జిల్లాకు వచ్చే సరికి అంత ప్రభావం కనిపించడం లేదు. గతంలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి. ఈ మధ్య జరిగిన మునుగోడు ఉపఎన్నిక ఓట్ల శాతం బీజేపీకి ఊరటనిచ్చింది. దీంతో ప్రజలతో సంబంధాలు కలిగి వారి నుంచి ఆదరణ పొందితే జిల్లాలో విజయం సాధించడం పెద్ద కష్టం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రజాదరణ కలిగిన నేతలేరి .. ?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్దగా పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయినట్లు కనిపించడం లేదు. కిందిస్థాయిలో కార్యకర్తలు ఉన్నప్పటికీ జిల్లా స్థాయిలో నేతల ఎవరు కూడా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రభావితం చేసేలా కనిపించడం లేదు. సుమారు 30 ఏళ్ల కింద దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ నల్గొండ జిల్లా కేంద్రం సంబంధించిన చింతా సాంబమూర్తి ఎన్నికయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హైదరాబాద్‌లోని మలక్‌పేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు కూడా ప్రస్తుత సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి సంబంధించిన నాయకుడే. వీరే కాకుండా డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డాక్టర్ జి మనోహర్ రెడ్డి లాంటి నేతలు అనేకమంది ఉన్నారు. వారు నియోజకవర్గంలోనే ప్రభావం చూపగలరు.

కీ రోల్ కోమటిరెడ్డి దేనా ..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జిల్లాలో పరిచయం అక్కర్లేని మాస్ లీడర్. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదేళ్లపాటు భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడిగా, మునుగోడు శాసనసభ్యుడిగా దాదాపు మూడున్నర ఏళ్ల పాటు పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దానికి కారణం వ్యక్తిగత ప్రభావమే తప్ప బీజేపీ పేరుతో పెద్దగా ఓట్లు పడింది లేదు. ఓటమిపాలైనప్పటికీ రానున్న రోజుల్లో ఎన్ని అవాంతరాలు ఎదురైనా మునుగోడు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి గెలుస్తాడని నమ్మకం సంపూర్ణంగా ఏర్పడింది. దానికి తోడు జిల్లాలో ఆయన దృష్టి సారిస్తే ఇతర నియోజకవర్గాల్లో కూడా గెలవలేకపోయినా ఓట్ల శాతం బలంగా పెరిగే అవకాశం ఉందని చర్చ జిల్లాలో సాగుతోంది.

ఆయన కూడా ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో పాటు భువనగిరి, ఆలేరు నకిరేకల్ నియోజకవర్గాలు భువనగిరి పార్లమెంట్ స్థానం తనకు అప్పగిస్తే గెలిపించి తీరుతానని పార్టీకి నచ్చ చెప్పినట్లు తెలుస్తుంది. ఇవి కాకుండా గతంలో ఆయనకున్న పరిచయాలతో నల్లగొండ, మిర్యాలగూడ ,తుంగతుర్తి ,హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కూడా ప్రభావం చూపించగలరని సమాచారం. ఇదిలా ఉంటే నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి తప్ప ప్రభావితం చేసే నేతలు ఎవరు లేరు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఆయనది ప్రధాన భూమిక ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే . ఇక సూర్యాపేట జిల్లాకు వస్తే సంకినేని వెంకటేశ్వరరావు సూర్యాపేటలో పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ తుంగతుర్తిలో ఆయన ప్రభావం ఉంటుంది. దాంతో రెండింటికే ఆయన పరిమితం కానున్నారు.

మూడు జిల్లాల అధ్యక్షుడు పరిస్థితి గమనిస్తే యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్ సుందర్ కొంత పరవాలేదనిపిస్తుంది. సూర్యాపేట, నల్లగొండ జిల్లా అధ్యక్షులు వారి సొంత నియోజకవర్గాలకు పరిమితమైనట్లుగా కనిపిస్తుంది. నియోజకవర్గం దాటి ప్రభావితం చేసే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా బీజేపీ రాజకీయాల్లో నేతల పనితీరును గమనించినట్లయితే ఆ పార్టీకి జవసత్వాలు నింపాలంటే జిల్లాలో ఒకే ఒక్కడుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనిపిస్తున్నాడని పార్టీ కార్యకర్తల్లో చర్చ జోరుగా సాగుతోంది. అందుకే రానున్న సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాస్థాయిలో కోమటిరెడ్డి దే " కి "రోల్ అన్నట్లుగా కనిపిస్తోంది. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.



Next Story

Most Viewed