నాగార్జున సాగర్ మునిసిపాలిటీ ‘హస్త’గతం.. చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం

by Disha Web Desk 1 |
నాగార్జున సాగర్ మునిసిపాలిటీ ‘హస్త’గతం.. చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం
X

దిశ, నాగార్జున సాగర్: నందికొండ మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ చీలిక వర్గం, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు మొత్తం తమ్మిది మంది ఓటేశారు. దీంతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కర్ణ అనూష శరత్ రెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్ (బిన్నీ) తమ పదవులను కోల్పోయారు. గురువారం మున్సిపల్‌ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరించిన ఆర్డీవో చెన్నయ్య ఆధ్వర్యంలో 9వ వార్డు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ ప్రతిపాదించగా.. మిగతా ఎనిమిది మంది సభ్యులు ఆమోదించారు. మున్సిపాలిటీలోని 11 మంది సభ్యులు ఉండగా 9 మంది సభ్యులు ఏక తాటిపై ఉండడంతో చైర్‌పర్సన్‌కు పదవీ గండం తప్పలేదు. మున్సిపల్‌ పీఠం కోల్పోవడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నిరాశ అలముకుంది. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన వారే తదుపరి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు చెందిన కుందూరు జయవీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

హాజరైన తొమ్మిది మంది కౌన్సిలర్లు

చైర్‌ పర్సన్‌కు వ్యతిరేకంగా నోటీసులు అందజేసిన తొమ్మిది మంది సభ్యులు గురువారం నేరుగా మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. కౌన్సిలర్లు ఈర్ల రామకృష్ణ, తిరుమలకొండ మోహన్ రావు, మంగత నాయక్, రమేష్, రమావత్ శిరీష మోహన్ నాయక్, ఆదాసు నాగ‌రాణి విక్రమ్, నిమ్మల ఇందిరా, అన్నపూర్ణ, నంద్యాల శ్వేతా‌రెడ్డి ఉదయం 11:30కు కౌన్సిల్‌ సమావేశ మందిరానికి చేరుకున్నారు. కోరంకు సరిపడా హాజరు ఉండడంతో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఆర్డీవో మేరకు ఫొటో, వీడియో చిత్రీకరణతో తొమ్మిది మంది కౌన్సిలర్ల సంతకాలు సేకరించారు. అనంతరం చైర్‌పర్సన్‌ కర్ణ అనూష శరత్ రెడ్డి‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఓటింగ్‌ నిర్వహించారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా తొమ్మిదికి తొమ్మిది మంది కౌన్సిలర్లు చేతులు పైకి ఎత్తడంతో, అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ధ్రువీకరించారు. కొత్త చైర్‌ పర్సన్‌ ఎన్నికకు తేదీ ప్రకటిస్తామని తెలిపారు.

కొత్త చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపికపై ఉత్కంఠ

నందికొండ మున్సిపాలిటీలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన శాఖ ఆమోదించిన అనంతరం నూతన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఇందుకు దాదాపు వారం, పది రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌ వెలువడగానే చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక జరుగనుంది.

Next Story

Most Viewed