కాంగ్రెస్ పార్టీలోకి మోత్కుపల్లి..?

by Naresh |
కాంగ్రెస్ పార్టీలోకి మోత్కుపల్లి..?
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: మాజీ మంత్రి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీలో చేరిక, తదితర అంశాల గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ పై అసంతృప్తి..

మోత్కుపల్లి నరసింహులు బీఆర్ఎస్ పార్టీలో గత కొద్ది రోజులుగా పూర్తి అసంతృప్తితో ఉన్నారు. గత రెండు నెలల క్రితం ఆలేరులో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎక్కడి నుంచి అయినా తనకు పోటీ చేసే అవకాశం కల్పించాలని బహిరంగంగానే కోరారు. అంతకు ముందు ఆయనకు దళిత బంధు చైర్మన్ ఇస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే అధికార పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లలో తన పేరు లేకపోవడంతో మోత్కుపల్లి ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు అరెస్టు అంశంపై సైతం స్పందిస్తూ అదే సమయంలో సీఎం కేసీఆర్ ను సైతం విమర్శించారు. అధికార పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో మోత్కపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జోరుగా నడుస్తుంది. ఇదే సమయంలో నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి తో సైతం ఆయన భేటీ అయినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ భేటీలో ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గ టికెట్టు పై చర్చ జరిగినట్లు ఊహాగానాలు వినిపించాయి.

దాదాపు ఖారారే..

మోత్కుపల్లి నరసింహులు డీకే శివకుమార్ ను కలిసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిక దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఢిల్లీ పెద్దల ఆధ్వర్యంలో హస్తం గూటికి చేరుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి.



తిరుగులేని నేతగా పేరున్న నాయకుడు..

ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి నర్సింహులు నల్గొండ జిల్లా రాజకీయాలను శాసించారు. ఆలేరు నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయాలు, తుంగతుర్తి నుంచి ఒకసారి విజయం సాధించారు. టీడీపీ, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన ఆయనకు జిల్లాపై పట్టు ఉంది. జిల్లాలోని అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజలు సైతం ఆయన పేరు చెప్పగానే టక్కున గుర్తుపట్టెంత విధంగా ప్రజల్లో ఉన్నారు.

Advertisement

Next Story