కాంగ్రెస్ సర్కారుపై జగదీశ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 9 |
కాంగ్రెస్ సర్కారుపై జగదీశ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, నాగార్జునసాగర్: కృష్ణానది నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ నుంచి ఏపీ ప్రభుత్వం నీటిని తరలించుకుపోవడంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర మత్తులో ఉండటంతోనే ఏపీ టెయిల్ పాండ్ నుంచి జల చౌర్యానికి పాల్పడిందని, దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీటి వనరుల విషయంలోనిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనడానికి ఇదొక నిదర్శనమన్నారు. నల్గొండ దాహార్తిని, ఆపద కాలంలో విద్యుత్ అవసరాన్ని తీర్చే టెయిల్ పాండ్ నీటిని దొంగతనంగా ఖాళీ చేస్తే జిల్లా మంత్రులకు సోయిలేదని మండిపడ్డారు. నల్గొండ జిల్లాను కాంగ్రెస్ సర్కార్‌ ఏడారిగా మార్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు.

గత 60 ఏళ్ళు కృష్ణా జలాల్లో మన హక్కుల సాధనకు కొట్లాడక కాంగ్రెసోళ్లు జిల్లాను కరువు కొరల్లోకి నెట్టారని, ఇప్పుడు కేఆర్‌ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు అప్పగించేందుకు సిద్ధపడి బీఆరెస్ పోరాటంతో వెనక్కి తగ్గారన్నారు. ప్రజలు కాంగ్రెస్ హామీలకు మోసపోయి ఓటేస్తే మత్తునిద్రలో ప్రభుత్వం జోగుతుందన్నారు. టెయిల్ పాండ్ నీటి చౌర్యానికి జిల్లా మంత్రులు , సీఎం రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఏపీ నీటి చౌర్యం పై విచారణ చేసి ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, కృష్ణా నీటి దోపిడీ పై పల్లెలోకి ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. టెయిల్ పాండ్ నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే మరో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

Next Story

Most Viewed