కోదాడ గడ్డ ఎవరి అడ్డా?

by Dishafeatures2 |
కోదాడ గడ్డ  ఎవరి అడ్డా?
X

దిశ, కోదాడ టౌన్: తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన ప్రాంతం . సకల జనుల సమ్మె మొదలు , వంట వార్పు , జాతీయ రహదారుల దిగ్బంధనం , ఆర్టీసీ సమ్మె , రాస్తారాకో లాంటి అనేక కార్యక్రమాలకు వేదికగా మారి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా ఊద్యమానికి ఊపిరి పోసిన ప్రాంతం. 1962 లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి మొత్తం మూడు సార్లు జనతాపార్టీ విజయం సాధించగా , ఒక్క సారి ఇండిపెండెంట్ , ఐదు సార్లు టీడీపీ , మూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా ఇప్పుడు భారాసా అభ్యర్థి ఎమ్మెల్యే గా కొనసాగుతున్నాడు . ఈ సారి ఎన్నికల్లో కోదాడ గడ్డ ఎవరికి అడ్డా అవుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ సారి కచ్చితంగా త్రిముఖ పోటీ ఉండబోతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో ఉంటారంటున్నారు. అధికార పార్టీ లో ఉండి కూడా ఇద్దరు ఎంపీపీలు,నలుగురు జెడ్పీటీసీలు వైరి వర్గం తో జతకట్టి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు . రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని తమ వర్గం వారికే టికెట్ వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణ కోసం అమరుడైన మీగడ సాయి కుమార్ పుట్టిన సొంత గడ్డ . రాష్ట్ర సరిహద్దు లో ఉన్న ఈ కోదాడ నియోజకవర్గం 1962 వ సంవత్సరంలో ఏర్పడినది. 2007 వ సంవత్సరం నియోజకవర్గ పునర్వ్యవస్తీకరణలో భాగంగా ఈ నియోజకవర్గంలో ఉన్న మేళ్ళ చెరువు మండలం హుజుర్ నగర్ కు , సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్న మోతే మండలాలు కోదాడలో కలిసాయి , కొత్తగా అనంతగిరి మండలం ఏర్పడటంతో నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఆరు మండలాలలో రెండు లక్షల పదిహేనువేలకు పైగా ఓటర్లు ఉన్నారు, నియోజకవర్గంలో మొత్తం పట్టణ జనాభా 20 శాతం ఉండగా గ్రామీణ ప్రాంతం జనాభా 80 శాతం ఉన్నారు.

అందరికి ఆదరణ

నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి మొత్తం మూడు సార్లు జనతాపార్టీ విజయం సాధించగా , ఒక్క సారి ఇండిపెండెంట్ , ఐదు సార్లు టీడీపీ , మూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా ఇప్పుడు భారాసా అభ్యర్థి ఎమ్మెల్యే గా కొనసాగుతున్నాడు . కోదాడ నియోజకవర్గంలో 2014 ఎన్నికలలో 85 శాతం ఓట్లు పోలవ్వగా 2019 ఎన్నికలలో 89.44 శాతం ఓట్లు పోలయ్యాయి . 2014 లో కాంగ్రెస్ అభ్యర్థిని ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బొల్లం. మల్లయ్య యాదవ్ పై 13,374 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది . మొత్తంగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి 45.4 శాతం ఓట్లు రాగా , టిడిపి కి 38 శాతం , తెరాసా కు 7.4 శాతం ఓట్లు పోలయ్యాయి .

2018 లో తెరాసా పార్టీ చివరి నిమిషం వరకు టికెట్ ప్రకటించకుండా అప్పటి వరకు టికెట్ కోసం పోరాడిన శశిధర్ రెడ్డి , చందర్ రావు లను కాదని అనూహ్యంగా టిడిపి నుండి తెరాసా లోకి వచ్చిన బొల్లం మల్లయ్య యాదవ్ కు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకొని రావలసిన బాధ్యత మీదే అంటూ శశిధర్ రెడ్డి , చందర్ రావులను పార్టీ ఆదేశించటంతో అధిష్టానం ఆదేశానుసారం చివరి నిమిషంలో ఇండిపెండెంట్ గా వేసిన తన నామినేషన్ ను ఉపసంహరించుకున్న శశిధర్ రెడ్డి పార్టీ కి వ్యతిరేకంగా ఎక్కడా ప్రచారం చేయకపోవడం , ఆ ఎన్నికలను ఒక సవాల్ గా తీసుకొన్న మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు పార్టీ కోసం పని చేయడం , అప్పటికే ఓటర్లలో సానుభూతి పెంచుకున్న మల్లయ్య యాదవ్ కు కోదాడ నియోజకవర్గ ప్రజలు 45.96 శాతం ఓట్లతో 89,115 ఓట్లు వేసి సమీప ప్రత్యర్థి ఉత్తమ్ పద్మావతి పై 756 ఓట్ల స్వల్ప మెజార్టీతో టీఆర్ఎస్ కు మొదటి సారి విజయం అందించారు.

ఈ ఎన్నికలలో గతం కంటే 6393 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అధికంగా ఓట్లు సంపాదించినప్పటికీ ఓటమి చవిచూసారు . 2018 ఎన్నికలలో మండలాలవారీగా చూసుకుంటే బిఆర్ఎస్ కు మెజార్టీ వచ్చిన మండలాలు చిలుకూరు , మునగాల , మోతే , నడిగుడెం లలో వరుసగా 589 , 1149 , 929 , 950 ఓట్ల మెజారిటీ రాగా కాంగ్రెస్ పార్టీ కి అనంతగిరి , కోదాడ రూరల్ , కోదాడ టౌన్ లలో వరుసగా 568 , 1001 , 1038 ఓట్ల మెజారిటీ లభించగా పోస్టల్ బ్యాలేట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ కి బిఆర్ఎస్ కంటే 342 ఓట్ల మెజారిటీ లభించింది .

ఈ సారి టికెట్ ఎవరికి - విజయం ఎవరిది

ఈ సారి జరగబోయే ఎన్నికలు గతం కంటే భిన్నంగా ఉండబోతాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు . ఈ సారి ఖచ్చితంగా త్రిముఖ పోటీ ఉండబోతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . బరీలో మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నిలవబోతున్నారని , గతంలో పోటీ చేసిన అభ్యర్థులే కాకుండా కొత్త వారు కూడా ఉంటారని , ఈ సారి పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిని చూసి ఓటేసే పరిస్థితి ఉంటుందని , గత ఎన్నికలకంటే పూర్తి భిన్నంగా ఈ సారి ఎన్నికలు ఉంటాయని వారు అంటున్నారు .

త్రిముఖ పోటీ ఏ ఏ పార్టీల మధ్య

నియోజకవర్గంలో త్రిముఖ పోటీ కాంగ్రెస్ , బీఆర్ఎస్ తో పాటు ఈ సారి ఒక పార్టీ నుండి టికెట్ ఆశించి భంగపడే అభ్యర్థి టీడీపీ లో చేరేందుకు సుముఖంగా ఉన్నాడా లేక బిజేపీ టికెట్ ఆఫర్ చేస్తుందా అన్న అంశంపై ఆధారపడి పోటీ ఉండనున్నట్లు తెలుస్తుంది . ఇప్పటికే నియోజకవర్గంలో అధికార పార్టీ లో ఉండి కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఇద్దరు ఎంపిపిలు,నలుగురు జెడ్పిటీసీలు వైరి వర్గం తో జతకట్టి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు . గతంలో ఎమ్మెల్యే కొరకు పనిచేసిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి. చందర్ రావు , ఎర్నేని వెంకటరత్నం బాబు , మహబూబ్ జానీ లు ఇప్పుడు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జట్టు కట్టడం వీరితో పాటు కన్మంతరెడ్డి. శశిధర్ రెడ్డి , ముత్తవరపు. పాండురంగా రావు , మున్సిపల్ చైర్మన్ వనపర్తి. శిరీష లక్ష్మీనారాయణ , కౌన్సిలర్లు తిపిరిశెట్టి. సుశీల రాజు , పెండెం. వెంకటేశ్వర్లు అసమ్మతి వర్గంలో చేరడం వీరంతా కలసి రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని శశిధర్ రెడ్డి కే ఈ సారి టికెట్ ఇప్పించుకోవాలని వారి ప్రయత్నాలు ముమ్మరం చెయ్యడం తో కోదాడ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో అని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు .

కాంగ్రెస్ లో అయోమయం

కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు , కార్యకర్తలలో అయోమయం నెలకొంది. ఈ సారి ఉత్తమ్ దంపతులలో ఎవరు పోటీ చేస్తారనే విషయంలో స్పష్టత లేకపోవడంతో పాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ పై కార్యకర్తలలో , ఓటర్లలో వ్యతిరేకత ఉన్నప్పటికీ దానిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో తమ అగ్ర నాయకత్వం చొరవ చూపడం లేదని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు . ఉత్తమ్ పై అధికార పార్టీ విమర్శలు చేస్తున్నా వాటిని తిప్పి కొట్టడంలో స్థానిక నాయకులు విఫలమవుతున్నారని దీనితో ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఇప్పటికైనా అగ్రనాయకత్వం మేల్కొని అధికార పార్టీకి ధీటుగా క్షేత్రస్థాయి కార్యక్రమాలు చేపట్టాలని కొరుతున్నారు . మరి ఆ పార్టీ నాయకత్వం ఏమి చేస్తుందో వేచి చూడాలి.



Next Story

Most Viewed