రాష్ట్రంలో రూ. 2 వేల కోట్లతో పర్యాటక రంగం అభివృద్ధి

by Kalyani |
రాష్ట్రంలో రూ. 2 వేల కోట్లతో పర్యాటక రంగం అభివృద్ధి
X

దిశ, సూర్యాపేట: తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం సుమారు రూ. 2 వేల కోట్లతో నిర్మాణపు పనులు చేపట్టనున్నట్లు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. టూరిజం చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టి రాష్ట్ర రాజదాని నుంచి తొలిసారిగా సూర్యాపేట కు వచ్చిన సందర్భంగా బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ పార్క్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి పటేల్ నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పటేల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తనకు అప్పగించిన ఈ బాధ్యతను సమర్దవంతంగా నిర్వహిస్తూ తెలంగాణను పర్యాటకంలో దేశంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.

అందుకు సీఎం కి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ లను తానూ త్యాగం చేసినందుకు సీఎం నాకు మంచి అవకాశం ఇచ్చారనీ స్పష్టం చేశారు. గత 30 ఏళ్లుగా సూర్యాపేట నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటున్నానని, వారితో కలిసి పని చేసిన నిజాయితీతో నాకు ఈ పదవి వచ్చిందని, అందుకు ఈ పదవి కార్యకర్తలకే అంకితం చేస్తున్నట్లు చెప్పారు. అన్ని సమయాల్లోనూ నా వెంట ఉండి నాకు మద్దతు పలికిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. సూర్యాపేట ని పర్యాటకంగా విశేషంగా రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.

ట్యాంక్ బండ్ లో బోటింగ్ అభివృద్ధి, ఉండ్రుగొండ, పిల్లలమర్రి, కాకతీయుల శివాలయాల అభివృద్ధితో పాటు మూసీ జలాశయంలో బోటింగ్ తో కలిపి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసి, సూర్యాపేట సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్, సీతక్క, తుమ్మల, జోపల్లితో పాటు సీనియర్ నాయకులు ఆర్డిఆర్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రాజా, ముదిరెడ్డి రమణా రెడ్డి, డా.వూర రామ్మూర్తి యాదవ్, గట్టు శ్రీనివాస్, వెంకన్న నాయక్, షఫీ ఉల్లా, వెలుగు వెంకన్న, యడ్ల వీరమల్లు, స్వామి నాయుడు, నిమ్మల వెంకన్న, జ్యోతి కరుణాకర్, నేరెళ్ళ మధు, బైరబోయిన శ్రీనివాస్, వల్దాస్ దేవేందర్, పాలడుగు పరశురామ్, రమేష్ నాయుడు, సాజిద్ ఖాన్, తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed