నారసింహుడి సన్నిధిలో గవర్నర్ తమిళిసై

by Disha Web Desk 1 |
నారసింహుడి సన్నిధిలో గవర్నర్ తమిళిసై
X

దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం స్వామి వారు వటపత్రశాయిగా దర్శనమిచ్చారు. యాదగిరీషుడిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దర్శించుకున్నారు. కళ్యాణ మండపంలో స్వామి వారిని దివ్యమనోహరంగా వట పత్రాలపైన అలంకరించారు. పశ్చిమ రాజగోపురం గుండా సేవను తిరు మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం వేంచేపు మండపంపై ఆస్థానం చేసి, వేద మంత్రాలు, దివ్య ప్రబంధ పశురాలను పఠించారు.

మాడ వీధుల్లో ఊరేగిన స్వామి వారి సేవోత్సవంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. ఉదయయే యాదాద్రి చేరిన గవర్నర్ మొదటగా స్వయంభు నరసింహుడి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి వటపత్రశాయి అలంకార సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న గవర్నర్‌ తమిళిసైకి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం గవర్నర్ తమిళసై మాట్లాడుతూ అద్భుత శిల్పకళతో పున: నిర్మితమైన నూతనాలయంలో జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాలకు తాను హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు లక్ష్మీనరసింహ స్వామి ఆరోగ్య సుఖ సంతోషాలను అందించాలని తాను కోరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో గీత, ఆలయ అధికారులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed