మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ లో రైతన్నల నిరీక్షణ

by Dishafeatures2 |
మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ లో రైతన్నల నిరీక్షణ
X

దిశ, మిర్యాలగూడ: రైతన్నకు నిరీక్షణ తప్పడం లేదు. దుక్కి దున్నడం మొదలుకొని ధాన్యం విక్రయించేంత వరకు రైతన్నల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రైతు రాజ్యం అని ప్రభుత్వం చెప్పుడే కాని చేతల్లో కనిపించడం లేదు. ప్రభుత్వం చెప్తున్న మాటలకు, ఇటు అధికారుల తీరుకు పొంతన కుదరడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది. మార్కెట్‌ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఇంకా మొదలుకాకపోవడంతో రైతన్న తిండితిప్పలుమాని పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. మిర్యాల గూడ వ్యవసాయ మార్కెట్ లో 60 వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు పేరుకపోయాయి. పది హేను రోజులుగా ధాన్యం వస్తున్నప్పటికీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు. మిల్లుల కేటాయింపు కోటాను ఉన్నతాధికారులు నిర్ణయించక పోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రోజుల తరబడిగా ధాన్యం రాశుల వద్ద కాపలా ఉంటున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టాలు కూడా లేవని అకాల వర్షం కురిస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు.

మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం రాశులుగా పేరుకుపోయాయి. మార్కెట్ ప్రాంగణంలో శనివారం నాటికి సుమారు 60వేల క్వింటాళ్ల మేరకు ధాన్యం అమ్మకానికి వచ్చింది. 15రోజులుగా మార్కెట్ కి ధాన్యం వస్తున్నప్పటికీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు. ఈ నెల 12న మిర్యాలగూడ, ఆలగడప ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు ప్రారంభించినప్పటికీ మిల్లుల కేటాయింపు కోటా ను ఉన్నతాధికారులు నిర్ణయించక పోవడంతో కొనుగోళ్లు నిలిచి పోయాయి. దీంతో రోజుల తరబడిగా ధాన్యం రాశుల వద్ద కాపలా ఉంటున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పట్టాలు కూడా లేవని అకాల వర్షం కురిస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 17శాతం మిచ్చర్ ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడాన్ని తప్పు బడుతున్నారు.

మిల్లులకు కేటాయించని కోటా

మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కి సమీప గ్రామాల రైతులు 15 రోజులుగా ధాన్యం తెస్తున్నారు. ప్రభుత్వం నిబంధనల మేరకు 17 తేమ శాతం ఉండేందుకు మార్కెట్ లో రోజుల తరబడి ధాన్యం ఆరబోసి ఉంచారు. వ్యవసాయ అధికారులు నమోదు చేసిన మాయిచ్చర్ 15 నుంచి 17శాతం మధ్య నమోదు చేసినా బస్తాలు అందుబాటులో లేవు. రైతుల వివరాలు నమోదు చేసే ఓపీఎం ట్యాబ్ లు సైతం సిబ్బందికి చేరలేదు. అన్నిటికి మించి సివిల్ సప్లై శాఖ నుంచి మిల్లుల కు కేటాయించే ధాన్యం సేకరణ కోటా ఇంకా నిర్దారణ కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. గత రబీకి సంబంధించిన బియ్యం కోటా మిల్లర్లు పూర్తిగా మిల్లర్లు చెల్లించక పోవడంతో ప్రభుత్వం కొన్ని మిల్లులను బ్లాక్ లిస్ట్ లో ఉంచింది.

ఇదే అదనుగా మిల్లర్లు సైతం తమ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ గందర గోలంలో మిల్లర్లకు రబీ టార్గెట్లు ఫిక్స్ కాలేదు. అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రోజుల తరబడి రైతులు మార్కెట్ లోనే పడిగాపులు కాస్తున్నారు. ఇదిలా ఉంటే ధాన్యం నగదు చెల్లింపులకు సంబంధించి ట్యాబ్ ల్లో రైతుల వివరాలు నమోదు చేసే సాఫ్ట్ వేర్ ని అప్ డేట్ చేయాల్సి రావడం తో పాటు ట్యాబు నిర్వహణ పై సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కొనుగోళ్ల ప్రారంభానికి మరో రెండు రోజులు పట్టేలా ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం వస్తే మా పరిస్థితి ఎంటోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

15 రోజులుగా మార్కెట్ లోనే నిరీక్షణ.. భూక్యా సైదమ్మ, జాలుబాయ్ తండా.

మాది మిర్యాలగూడ మండలం లోని జాలుబాయ్ తండా. 15రోజుల కిందట కోతలు కోసి 1010 రకం 100బస్తాల ధాన్యాన్ని అరబెట్టేందుకు మార్కెట్ కి తీసుకొచ్చాను. ఈ నెల 12న కొనుగోలు ప్రారంభించిన అధికారులు ఒక్క గింజ కూడా కొనడంలేదు. అడిగితె బస్తాలు లేవు, ట్యాబ్ లు రాలేదని సమాధానం ఇస్తున్నారు. పట్టాలు కూడా ఇవ్వలేదు. వర్షం కురిస్తే ధాన్యం పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు.

400 బస్తాల ధాన్యం తెచ్చాను.. ధనవత్ మంగ్య, గోన్య తండా.

మాది మండలం లోని దుద్యాతండా హమ్లెట్ గోన్య తండా. నేను పది రోజుల క్రితం 1010 రకం 400బస్తాల ధాన్యం మార్కెట్ కి తెచ్చాను. 15శాతం మాయిచ్చర్ నమోదు చేసిన వ్యవసాయ అధికారులు ధాన్యం మాత్రం కొనడం లేదు. అడిగితె బస్తాలు లేవు, ట్యాబ్ లు లేవని సమాధానం ఇస్తున్నారు. దీంతో ధాన్యం రాసుల వద్దనే కాపలా ఉంటున్న. ఎప్పుడు వర్షం కురుస్తుందోనని ఆందోళనగా ఉంది.

సోమవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తాం.. మిర్యాలగూడ ప్రాథమిక సహకార సంఘం సీఈఓ లచ్చయ్య.

నిబంధనల మేరకు 17శాతం మాయిచ్చర్ ఉండేలా రైతులు ధాన్యం ఆరబోయాలి. ధాన్యం కొనుగోలు కి అవసరం అయిన ఖాళీ బస్తాలు కాంటాలను సిద్ధం చేశాము. రైస్ మిల్లుల కి ధాన్యం కోటా కేటాయింపులు పూర్టైనట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ట్యాబు ల్లో రైతుల వివరాల నమోదుకు సంబంధించి ఓపీఎం సిబ్బంది కి నల్గొండ లో శిక్షణ ఇస్తున్నారు. సోమవారం నుంచి మార్కెట్లో ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తాం.



Next Story

Most Viewed