రోడ్డు సమస్యపై గ్రామస్థుల ధర్నా

by Naresh N |
రోడ్డు సమస్యపై గ్రామస్థుల ధర్నా
X

దిశ, మునుగోడు: మునుగోడు మండలం సింగారంలో పూర్వీకుల కాలం నుండి గ్రామ కంఠం భూమిలో ఉన్న రోడ్డును, అదేవిధంగా కొంత భూమిని ఆక్రమించి రెండు రోజుల నుండి ప్రహరీగోడ నిర్మాణం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకొని, భూమిని కాపాడాలని కోరుతూ గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అధికారులు వెంటనే అక్రమ కట్టడాన్ని ఆపాలని కోరారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ భూములను కాపాడి ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా చూడాల్సిన సర్పంచ్ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఆందోళన కలిగిస్తుందని ఎమ్మెల్యేకు వివరించారు. గతంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని, ఇటీవల గ్రామ పంచాయతీ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అక్రమ కట్టడం ఆపడం లేదని ఎమ్మెల్యేకు ప్రజలు వివరించారు. వివాదాస్పద భూమిని ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రజల సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం కొద్దిసేపు గ్రామ పంచాయతీ కార్యాలయ వద్ద కూర్చొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో తిరిగి మురుగు కాలువలను పరిశీలించారు. ఎంపీటీసీ ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యల పరిష్కారానికి ముందుండాలని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, పెద్ద సంఖ్యలో యువకులు, పాల్గొన్నారు.

Next Story

Most Viewed