కేసీఆర్ ను గల్లీగల్లీ తిరిగేటట్లు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే

by Disha Web Desk 15 |
కేసీఆర్ ను గల్లీగల్లీ తిరిగేటట్లు చేసిన ఘనత సీఎం  రేవంత్ రెడ్డిదే
X

దిశ, భువనగిరి రూరల్ : అధికార గర్వంతో మీడియా మెట్లు ఎక్కని కేసీఆర్ ను గల్లీ గల్లీ తిరిగేటట్లు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల రిటర్న్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... పదేండ్ల పాలనలో లక్ష ఐదు వేల కోట్ల అప్పు చేసిన ఘనత దేశంలోనే మోడీకి దక్కిందని విమర్శించారు. మతాల, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడడానికి అసెంబ్లీకి రాని కేసీఆర్ ఓట్ల కోసం బస్సు యాత్ర, రోడ్ యాత్ర అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ మళ్లీ మోసం చేయటానికి సిద్ధమైండని విమర్శించారు. ఎన్నడూ మీడియా ముందుకు రాని కేసీఆర్ నాలుగు గంటలు మీడియాతో మాట్లాడి కాలేశ్వరం అక్రమాలు, కమీషన్ల గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ప్రతి ఒక్క పౌరుడు కాంగ్రెస్ కు ఓటేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలన్నారు. గల్లీలోనే కాదు ఢిల్లీలో కొట్లాడడానికి పార్లమెంట్ కు చామల కిరణ్ కుమార్ రెడ్డి ని పంపించాలని కోరారు. యువజన నాయకుడు గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గుర్తించి అధిష్టానం టికెట్ ఇవ్వడంతోనే భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి గెలుపు ఖాయమైందని జోష్యం చెప్పారు. భువనగిరి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి చెమల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... గత పదేళ్లు పాలించి రుణమాఫీ చేయని బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అర్హత లేదన్నారు. లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ఆగస్టులో రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షించదగ్గ విషయం అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నంలో ఉన్న మోదీ ప్రయత్నాల్ని ప్రతి ఒక్కరూ తిప్పి కొట్టాలని అన్నారు. బీసీ కుల గణన చేపట్టడంతో పాటు, బడుగు బలహీన, పేద వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసే కాంగ్రెస్ కు ఓటు వేసి తనని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed