కారు ఖార్కానకు.. కేసీఆర్ దవాఖానకు..

by Disha Web Desk 15 |
కారు ఖార్కానకు.. కేసీఆర్ దవాఖానకు..
X

దిశ, చిట్యాల : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, దానిని పూర్తిగా బొంద పెట్టేంత వరకు నిద్రపోనని మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం చిట్యాల పట్టణ కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కనకదుర్గ సెంటర్లో జరిగిన సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 10 ఏళ్లు పరిపాలన చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాడని, బిడ్డ లిక్కర్ కేసులో అడ్డంగా దొరికి తీహార్ జైల్లో ఉందని, ఫోన్ టాపింగ్ అంశంపై మరో కేసు నడుస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో సిగ్గు లేకుండా కేసీఆర్ ఏ మొఖం పెట్టుకొని జనాల్లో తిరుగుతున్నాడో చెప్పాలన్నారు. బీజేపీ నాటినుండి నేటి వరకు కులం పేరుతో, మతం పేరుతో ప్రజల మధ్య వైశమ్యాలు సృష్టించి రాజకీయాలు చేస్తుందని, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు దీన్ని గమనిస్తున్నారన్నారు.

త్వరలోనే బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పి కాంగ్రెస్​కు అధికారం కట్టబెడతారని ఆశించారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసమే పాటుపడే పార్టీ అన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని మెజార్టీ ఎంత వస్తుందనే దానిమీదనే ఎదురుచూస్తున్నామన్నారు. అలాగే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం లో కాంగ్రెస్కు అత్యధిక మెజార్టీ ఇవ్వడంలో నకిరేకల్​, మునుగోడు నియోజకవర్గాలు పోటీ పడనున్నట్లు చెప్పారు. అనంతరం అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చిట్యాల పట్టణంలో జాతీయ రహదారి భయంకరంగా మారిందని, వెంటనే పట్టణ కేంద్రంలో

అండర్పాస్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని, అలాగే మండలంలో డ్రై పోర్టు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ధర్మారెడ్డి కాల్వలను పూర్తిచేసి మండల రైతన్నల పొలాల్లోకి గోదావరి జలాలను మళ్లించచడమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ శాసనమండలి ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు దుబ్బాక నరసింహ రెడ్డి, దైద రవీందర్, గుత్తా అమిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed