బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడి పై హైడ్రామా

by Naresh N |
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడి పై హైడ్రామా
X

దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్)మండలం గట్టికల్లు గ్రామానికి తన గెలుపును అభ్యర్థిస్తూ ప్రచారానికి వెళ్లిన సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ పై జరిగిన దాడిపై ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం కూడా సూర్యాపేటలో హైడ్రామా కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు జానయ్య యాదవ్ పై హత్యాయత్నానికి ప్రయత్నం చేసిన వ్యక్తులకు ఆ సమయంలో పోలీసులు వత్తాసు పలికారనే ఆరోపణలతో పట్టణం అట్టుడికిపోతోంది. జానయ్యపై దాడి చేసిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ నాయకులని ఆరోపిస్తుండగా మరో పక్క దాడి చేసిన వ్యక్తులు తమ పార్టీ కాదంటే కాదని అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీల నాయకులు సోషల్ మీడియా వేదికగా వాదోపవాదనలు చేసుకుంటున్నారు. కాగా జానయ్య ఆరోగ్య పరిస్థితి పై సోమవారం మధ్యాహ్నం వరకు కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. సుమారు రెండు గంటల సమయంలో ఏరియా ఆసుపత్రి నుంచి దిశ్చ్చార్జీ అయిన జానయ్య మాట్లాడుతూ... సూర్యాపేటలో రెడ్ల రాజ్యం నడుస్తుందని, ఈ నియోజకవర్గంలో నువ్వు రెడ్ల మీద పోటీ చేస్తావా...అంటూ మంత్రి జగదీష్ రెడ్డి బంధువులు, బీఆర్ఎస్ నాయకులు తనపై దాడి చేశారని ఆరోపించారు. తన అనుచరులు లేకుంటే నన్ను రాత్రికి రాత్రే మట్టుబెట్టే వారని కన్నీరు మున్నీరయ్యారు. జానయ్య యాదవ్ దాడిని ఖండిస్తూ ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏరియా ఆసుపత్రికి సోమవారం తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు.

నా భర్తను మంత్రి ఏ సమయంలోనైనా చంపిస్తారు...

నా భర్త వట్టే జానయ్య యాదవ్‌ని మంత్రి జగదీష్ రెడ్డి ఏ సమయంలో నైనా చంపించొచ్చని కౌన్సిలర్ వట్టే రేణుక కన్నీరు పెట్టుకున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీని వీడిన దగ్గరి నుంచి మాపై మంత్రి కక్ష్య సాధింపు ధోరణి కొనసాగిస్తున్నాడని, నా భర్త జానయ్యను ఏదో ఒక రకంగా మట్టు బెట్టాలని చూస్తున్నట్లు ఆమె ఆరోపించారు. అందుకే గట్టికల్లులో ఆయన బంధువులను ఊసురుగొలిపి హత్య చేసే ప్రయత్నం చేశారని కన్నీరు పెట్టుకున్నారు. నా భర్తకు ఏదైనా జరిగితే మంత్రి జగదీష్ రెడ్డియే బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు.

దొరలు, పెత్తందారులు ఆకృత చర్యలకు పాల్పడితే రాజకీయ సమాధి కడతాం..దొరలు,పెత్తందారులు ఆకృత చర్యలకు పాల్పడితే రాజకీయ సమాధి కడతామని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు భీమయ్యగౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... ఆదివారం ఆత్మకూరు(ఏస్)మండలం గటికల్లు గ్రామంలో బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ పై మంత్రి బంధువులు దాడికి పాల్పడం హేయమైన చర్య అన్నారు. బహుజన రాజ్యం ఏర్పాటు కోసం ఒక బీసీ బిడ్డ పోరాడుతుంటే ప్రజలలో బీఎస్పీ పార్టీ ఆదరణ చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనుల కోసం రాజ్యాధికారం కోసం పోరాడుతుంటే ఇలాంటి అరాచకాలకు పాల్పడవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వారికి త్వరలోనే ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్తామని స్పష్టం చేశారు. ఈ మండలంలో ఎస్సైకి గొడవ జరుగుతున్న సమయంలో సమాచారం ఇచ్చినప్పటికి కావాలనే ఆలస్యంగా వచ్చి, గొడవ చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయకుండా వాళ్ళని బుజ్జగింజారే తప్ప అడ్డుకోలేదని ఆరోపించారు. బహుజనులపై దాడి చేస్తే ఇకపై సహించేది లేదని, దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శ్రీనివాస్, ఇస్తాలపురం ఎంపీటీసీ చెరుకు ఇందిర, ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా కన్వీనర్ పోకల ఎలిజబెత్, నకిరేకంటి వెంకన్న, పట్టణ అధ్యక్షులు గట్టు గోపి, ఉపేందర్, కళ్యాణి, లలిత, నాగయ్య,శోభా భాయ్, నవీన్ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed