సాగర్ లో నీళ్లు ఉన్నా పంటలను ఎండబెట్టిండ్రు : జగదీశ్ రెడ్డి

by Disha Web Desk 11 |
సాగర్ లో నీళ్లు ఉన్నా పంటలను ఎండబెట్టిండ్రు : జగదీశ్ రెడ్డి
X

దిశ, హాలియా : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీళ్లున్నా ఒక్క తడి సాగునీరు ఇవ్వలేక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం హాలియాలో నాగార్జునసాగర్ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ జలాశయంలో 2014 కంటే అధికంగా నీటి లభ్యత ఉన్నప్పటికీ సాగునీటి విషయంలో జిల్లా మంత్రులకు అవగాహన లేక రైతుల పంటలను ఎండబెట్టిన దద్దమ్మలు జిల్లా మంత్రులని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీలు ఇచ్చినప్పటికీ హామీలను విస్మరించిందని ఫోన్ టాపింగ్ ల పేరుతో అభివృద్ధిని పక్కదారి పట్టిస్తుందని ద్వజమెత్తారు.

కొన్ని పత్రికలు ప్రజా సమస్యలపై కాకుండా బీఆర్ఎస్ నాయకుల ఫోన్ టాపింగ్ ల బూచి పైనే ముఖ్యవార్తలు ప్రచురిస్తున్నారని ఆరోపించారు. అబద్ధపు హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబంధు పథకాలను విస్మరించిందని రైతులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ టాపింగ్ ఆరోపణల్లో పసలేదని కొండను తవ్వి ఎలుక తోకను కూడా పీకలేరని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని తెలిపారు.

ఉద్యమకారులను పట్టించుకునే వారేరీ....

ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నాగార్జునసాగర్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం ప్రారంభ సమయంలో పలువురు ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీలో తమను పట్టించుకోవడంలేదని, పార్టీ కార్యక్రమాలకు తమకు చెప్పడం లేదంటూ పలువురు యువజన విభాగం నాయకులు ఘర్షణకు దిగారు. పార్టీలో తమకు గుర్తింపు లేదని స్థానిక పార్టీ ఇంచార్జ్ పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ప్రోటో కాల్ పాటించలేదని ఆరోపించడంతో స్థానిక ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి కార్యకర్తలకు నచ్చజెప్పారు.

మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ ,రవీంద్ర కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, బూడిద బిక్షమయ్య గౌడ్, మాజీ ట్రైకర్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్, మాజీ ఆప్కాబ్ చైర్మన్ ఎడవల్లి విజయేందర్ రెడ్డి, పలువురు జిల్లా బీఆర్ఎస్ నాయకులు మండల పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed