పత్తి విత్తనాల బ్లాక్ దందాలో ఓ మంత్రి పాత్ర...!

by Kalyani |
పత్తి విత్తనాల బ్లాక్ దందాలో ఓ మంత్రి పాత్ర...!
X

దిశ, సూర్యాపేట: తెలంగాణలో ప్రభుత్వాన్ని నడపలేక తన చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకు కమీషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు. అందుకు మీడియాకు ముందస్తుగానే లీకులిచ్చి చెత్త, రోత రాతలు రాపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడంపై ఆయన బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు నెలలైనప్పటికి హామీల అమలు మరచి గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ మంత్రులు పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. విచారణ, కమీషన్లు వాటి పని అవి చేసుకుపోతాయని, దానిపై ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల కోడ్ ముగిశాక హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారని కమీషన్ల విచారణ పేరుతో మీడియాకు లీకులిచ్చి డ్రామాలు ఆడుతున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్ పసలేని ఆరోపణలన్ని వరుసగా తెలిపోతున్నాయని, కాళేశ్వరంలో నీళ్ళు నిలిపి సాగునీరు అందించకుండా తప్పు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగు నెలలుగా సమయం వృధా చేసి ఇప్పుడు హడావిడి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వ లోపాలంటూ ఆరోపణలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అందుకు నీళ్ళు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు నేడు మంచినీళ్ల కోసం రోడ్డెక్కిన పరిస్థితి కనిపించడమే కారణమని, పదేళ్ళ క్రితం ఉన్న దుస్థితి మళ్ళీ దాపురించాయని పేర్కొన్నారు.

పత్తి విత్తనాల కొరతలో ప్రభుత్వ పెద్దలు పాత్ర ఉందని, విత్తనాల బ్లాక్ దందాపై ఓ మంత్రి పాత్ర ఉందని ముక్త కంఠం తో చెప్పారు. దీనిపై స్పష్టమైన ఆధారాలు రాగానే త్వరలో పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడిస్తానని స్పష్టం చేశారు. ఈ సమయంలో ఆయన వెంట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, నాయకులు సవరాల సత్యనారాయణ, బూర బాల సైదులు గౌడ్, ఆకుల లవకుశ, అనిల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.Next Story

Most Viewed