ధరణి పోర్టల్‌పై MP రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
ధరణి పోర్టల్‌పై MP రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో తెలంగాణలో భారీ దోపిడీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కంప్యూటరైజేషన్ పేరుతో ధరణిలో భారీగా దోపిడికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్.. జడ్చర్లలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. ప్రభుత్వంలోని కీలక శాఖలన్నీ సీఎం కేసీఆర్ కుటుంబం చేతుల్లోనే ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్యే పోటీ అని అన్నారు. కాళేశ్వరం, ధరణి పోర్టల్‌తో కేసీఆర్ దోచుకున్న లక్షల కోట్లను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బయటకు తీసి.. ప్రజల సొమ్మును తిరిగి ఇప్పిస్తామని ఈ సందర్భంగా రాహుల్ హామీ ఇచ్చారు.

అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చిన వెంటనే ఓబీసీ జన గణన చేపడతామని హామీ ఇచ్చారు. 2024లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఓబీసీ జన గణన చేపడతామన్నారు. దేశంలో బీజేపీ మతాల పేరుతో కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతుందని ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయని.. కాంగ్రెస్ ఎక్కడ పోటీ చేస్తే ఎంఐఎం పార్టీ అక్కడి పోటీ చేసి బీజేపీ సపోర్ట్ చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు మోడీ సర్కార్ తనపై 24 కేసులు పెట్టిందని తెలిపారు. అలాంటిది కేసీఆర్ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ ఆయనపై సీబీఐ, ఈడీ ఎలాంటి ఎంక్వైరీ ఉండదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని.. కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.

Next Story

Most Viewed