తెలుగు రాష్ట్రాలపై మోడీ ఫోకస్.. అదిరిపోయే వ్యూహంతో పార్టీ బలోపేతం

by Disha Web Desk 12 |
తెలుగు రాష్ట్రాలపై మోడీ ఫోకస్.. అదిరిపోయే వ్యూహంతో పార్టీ బలోపేతం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీ శకం నడుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాలతో సతమతం అవుతున్న భారత రాజకీయాల్లో సంపూర్ణ మెజార్టీతో రెండు దఫాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇటు ప్రభుత్వాన్ని అటు పాలిటిక్స్ లో చక్రం తిప్పుతున్న వ్యక్తిగా మోడీ నిలిచారు. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనే ప్రయత్నాల్లో ఉన్న నరేంద్ర మోడీ తాజాగా ఢిల్లీలో పార్టీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. పార్టీ ఎదుగుదల ఎక్కడి నుంచి ఏ స్థాయికి చేరిందో గుర్తు చేస్తూనే ప్రజల నమ్మకాన్ని ఏ మేరకు చూడగోరామన్నది వివరించారు. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వ్యూహం ఎంత పకడ్బందీగా ఉందో మోడీ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

మే నెలలో ఎన్నికలు జరగబోయే కర్ణాటకలో బలంగా ఉన్నామని చెబుతూనే తెలంగాణ, ఏపీని తన ప్రసంగంలో ప్రస్తావించడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. తెలంగాణలో ప్రజలు ఇప్పుడు ఒక్క బీజేపీపై మాత్రమే నమ్మకం కలిగి ఉన్నారని ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజలు తమ వైపు చూస్తున్నారని చెప్పారు. తమిళనాడు, కేరళలో పార్టీ పునాదులు పటిష్టంగా ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ తో పూర్తిస్థాయిలో వైరం కొనసాగిస్తున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో కారు పార్టీ స్పీడ్ కు బ్రేకులు వేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో బండి సంజయ్ నేతృత్వంలో రాష్ట్ర శాఖ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు ఉధృతం చేస్తోంది.

ఇదే సమయంలో జాతీయ స్థాయిలో మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాల వ్యూహం ఆసక్తిని రేపుతోంది. ప్రీ ఎలక్షన్, పోస్ట్ ఎలక్షన్ వీటి మధ్య జరిగే రాజకీయ పరిణామాలను పక్కాగా లెక్కలేసుకున్న కాషాయ పార్టీ పెద్దలు.. కేసీఆర్, కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేలా భారీ వ్యూహంతో ఉన్నారా అనే చర్చ జరుగుతోంది. ఇటీవల రాహుల్ గాంధీ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కేసీఆర్ స్పందించారు. కాంగ్రెస్ కు నైతిక మద్దతుగా తన గళాన్ని విప్పారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపై క్షేత్రస్థాయిలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఈ రెండు పార్టీల మధ్య కన్ఫ్యూజన్ కొనసాగేలా వ్యూహరచన చేస్తూనే తన పని తాను సైలెంట్ గా చేసుకుపోతోంది.

సందర్భం వచ్చిన ప్రతిసారీ తెలంగాణపై జాతీయ స్థాయి నేతలతో రియాక్ట్ అయ్యేలా చేయడం బీజేపీ వ్యూహంలో భాగంగా తెలుస్తోంది. తాజాగా ప్రధాని మోడీ సైతం తన ప్రసంగంలో సౌత్ ఇండియాపై స్పందిస్తూ తెలంగాణలో ప్రజలు ఇప్పుడు ఒక్క బీజేపీపై మాత్రమే విశ్వాసం కలిగి ఉన్నారని చెప్పడం వెనుక తమ పొలిటికల్ టార్గెట్ కేసీఆరే అని చెప్పకనే చెబుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీ రోజు రోజుకు పదునైన వ్యూహాలతో దూసుకువస్తుంటే వారికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిని రేపుతోంది.



Next Story

Most Viewed