కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కూలిపోయేందుకు మరో బ్యారేజీ సిద్ధం: మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కూలిపోయేందుకు మరో బ్యారేజీ సిద్ధం: మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.95 వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిందని.. అంత ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మరో బ్యారేజీ కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉందని ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తోన్న విమర్శలకు సోమవారం మీడియా సమావేశంలో ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేఆర్ఎంబీకి మా ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పగించలేదని.. ఇకపై కూడా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని ఉత్తమ్ తేల్చి చెప్పారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

కృష్ణా జలాల వాటాల్లో కేసీఆర్, ఏపీ సీఎం జగన్న కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలను ఏపీకి తీసుకెళ్తుంటే కేసీఆర్ సహకరించారని అన్నారు. ఏపీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టుకునేందుకు కూడా అప్పటి సీఎం కేసీఆరే సహకరించారని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణ అంచనాలను పెంచుతూపోయారన్నారు. రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు ప్రాజెక్ట్ నిర్మించి ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్‌బీసీ పూర్తి చేయలేదని నిప్పులు చెరిగారు. గ్రావిటీ ద్వారా మనకు రావాల్సిన 8 టీఎంసీల కృష్ణా జలాలను వదిలేశారన్నారు.



Next Story

Most Viewed