బొంగులో చికెన్ వర్సెస్ నాటు కోడి.. ‘పప్పు’ అని విమర్శిస్తూనే రాహుల్ బాటలో మంత్రి కేటీఆర్..!

by Satheesh |
బొంగులో చికెన్ వర్సెస్ నాటు కోడి.. ‘పప్పు’ అని విమర్శిస్తూనే రాహుల్ బాటలో మంత్రి కేటీఆర్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేతను ‘పప్పు’ అని విమర్శిస్తున్న మంత్రి కేటీఆర్.. ఇప్పుడు ఆయన్నే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పుదుకోట్టై జిల్లాలోని చిన్నవీరమంగళం గ్రామంలో విలేజ్ కుకింగ్ ఛానెల్ ప్రోగ్రామ్‌లో మష్రూమ్‌ (పుట్టగొడుగులు) బిర్యానీ వండి గ్రామస్తులతో కలిసి తిన్నారు. ఇప్పుడు కేటీఆర్ సైతం అదే బాట ఎంచుకున్నారు. ‘మై విలేజ్ షో’ టీమ్ నిర్వహించిన ప్రోగ్రామ్‌లో గంగవ్వతో కలిసి కేటీఆర్ నాటు కోడిపులుసు వండారు. రాహుల్‌గాంధీకి వచ్చిన మైలేజ్ చూసి ఆయన్ను ఓ వైపు తిడుతున్నా.. రాహుల్ బాటను ఎంచుకోవడం కేటీఆర్‌కు తప్పలేదంటూ నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.

యూత్‌లో ఫాలోయింగ్‌ను చూసి

కేటీఆర్ కూడా రాహుల్ తరహా ప్రోగ్రామ్‌‌కు ప్లాన్ చేశారని సోషల్ మీడియాలో మెసేజ్‌లు హోరెత్తుతున్నాయి. అందుకే ‘మై విలేజ్ షో’ టీమ్ నిర్వహించిన ప్రోగ్రామ్‌లో గంగవ్వతో కలిసి కేటీఆర్ నాటు కోడిపులుసు వంట చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాహుల్‌గాంధీని ‘పప్పు’ అని తిడుతున్న కేటీఆర్.. ఆయన బాటలోనే ఎందుకు వెళ్తున్నారంటూ మంత్రిపై సెటైర్లు పేలుతున్నాయి. ఇక నుంచి ‘పప్పు’ అని అనడాన్ని మానేస్తారా? లేక ఆయనను ఇలాంటి వంటల వీడియోలతో ఫాలో కావడం మానేస్తారా అనే టాక్ వినిపిస్తున్నది.

రెండేండ్ల కిందనే రాహుల్..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మూడు రోజులపాటు ప్రచారానికి వెళ్లిన రాహుల్‌గాంధీ 2021 జనవరి 25న పుదుక్కోట్టై జిల్లాలోని వీరమంగళం గ్రామంలో తమిళ యువకులు నడిపిస్తున్న వంటల చానెల్ (యూట్యూబ్) గురించి తెలుసుకున్నారు. లోకల్ ఎంపీ జ్యోతిమణి ద్వారా వివరాలు తెలుసుకొని వారిని కలిశారు. పుట్టుగొడుగుల బిర్యానీ వంటలో పాల్గొని వారితోనే కలిసి లంచ్ చేశారు. దాదాపు పావుగంట నిడివి ఉన్న ఈ వీడియో జనవరి 30న యూట్యూబ్‌లో అప్‌లోడ్ కావడంతో ఒక్క రోజులోనే 20 లక్షల మంది వీక్షించడం అప్పట్లో సంచలన వార్తగా మారింది.

ఆ తర్వాత భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో పర్యటించిన రాహుల్‌గాంధీ.. 2022 నవంబరు 6న ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని జోగిపేట మండలం దానంపల్లి గ్రామంలో బాంబూచికెన్ తయారీలో పార్టిసిపేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఆదివాసీలు, గిరిజనులు వండుకునే ఈ వంటకాన్ని చూసి రాహుల్ ఆశ్చర్యపోయారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క దీని తయారీ విధానాన్ని, అవసరాన్ని రాహుల్‌కు వివరించారు. రాహుల్‌గాంధీ బాంబూ చికెన్ తయారీ ప్రక్రియలో పాల్గొని దాని రుచిని ఆస్వాదించడం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది.

పరస్పర విమర్శలు..

రాహుల్‌గాంధీని కేసీఆర్ గతంలో బఫూన్ అంటూ కామెంట్ చేశారు. తగిన రాజకీయ పరిణతి లేదని, చైల్డిష్ మెంటాలిటీ అని పలువురు బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్ ఆయనను ‘నేషనల్ పప్పు’ అని విమర్శించారు. దీనికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. రాహుల్‌తో పాటు తనను కూడా పప్పు అని కేటీఆర్ సెటైర్ వేస్తున్నారని, కానీ తాము శరీరానికి, ఆరోగ్యానికి ప్రొటీన్‌లు ఇచ్చే కందిపప్పు అని.. కానీ కేటీఆర్ మాత్రం తింటే చచ్చిపోయే గన్నేరు పప్పు అని కౌంటర్ వేశారు.

రేవంత్ నుంచి ఈ కామెంట్ వచ్చిన రెండు రోజుల్లోనే కేటీఆర్ గంగవ్వతో కలిసి నాటుకోడి పులుసు వంటల ప్రోగ్రామ్‌లో పాల్గొనడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ వీడియో వైరల్ కావడం సంగతి ఎలా ఉన్నా.. ఆయనను ఈ దిశగా డ్రైవ్ చేసింది మాత్రం ఆయన పప్పు అని తరచూ విమర్శించే రాహుల్‌గాంధీయే అనే మెసేజ్‌లు, కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవైపు విమర్శిస్తూనే మళ్లీ ఆయననే ఎందుకు ఫాలో అవుతున్నారంటూ కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed