వచ్చే ఎన్నికల్లో BRS హ్యాట్రిక్ విజయం ఖాయం: మంత్రి కేటీఆర్

by Disha Web Desk 19 |
వచ్చే ఎన్నికల్లో BRS హ్యాట్రిక్ విజయం ఖాయం: మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అన్నివర్గాల అభిమానాన్ని చూరగొన్న బీఆర్ఎస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 25న ప్రతినిధుల సభలను పెద్దఎత్తున విజయవంతం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల సమరానికి బలమైన పునాది వేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు త్వరలో రానున్న తరుణంలో ఈనెల 25న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభ పార్టీ యంత్రాంగం మొత్తానికి గొప్ప అవకాశమని అన్నారు.

తొమ్మిదేళ్ల ప్రభుత్వ ప్రస్థానాన్ని ప్రజలకు మరోసారి వివరించేందుకు, పార్టీ కేడర్ ను ఎన్నికలకు కార్యోన్ముఖులను చేసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతినిధుల సభకు సంబంధించి సలహాలు, సూచనలను చేశారు. ప్రతి నియోజకవర్గంలో 3వేల నుంచి 3500 మంది కార్యకర్తలతో ఈ పార్టీ ప్రతినిధుల సభకు ఆహ్వానించాలని, దాదాపు 4 లక్షల మంది పార్టీ నాయకులను ఇందులో మమేకం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తొలిసారి నియోజకవర్గ స్థాయిలో జరుగబోతున్న ఈ ప్రతినిధుల సభ వచ్చే ఎన్నికలకు శంఖారావం లాంటిదన్నారు. కార్యకర్తల్లో సమరోత్సాహాన్ని నింపడంతోపాటు.. సీఎం కేసీఆర్ సారథ్యంలో.. పార్టీ అద్భుతమైన హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ఈ సభల ద్వారా బలమైన పునాది వేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అవగాహనతోపాటు, బీజేపీ అన్యాయాలు, మోసాలు, వైఫల్యాలపై పార్టీ శ్రేణులకు అవగాహణ వచ్చేలా సభల నిర్వహణ ఉండాలన్నారు.

నాటి తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని, తొమ్మిదేళ్ల తెలంగాణ ఉజ్వల ప్రయాణాన్ని సభలలో సమగ్రంగా చర్చించేలా ప్రసంగాలు, రాజకీయ తీర్మాణాలు ఉండాలని వెల్లడించారు. పార్టీ ప్రతినిధుల సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని సూచించారు. సభల్లో 6 తీర్మానాల ద్వారా పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, బీజేపీ తెలంగాణకు చేస్తున్న అన్యాయంను ప్రజలకు వివరించేలా తీర్మానాలు చేయాలన్నారు. వ్యవసాయం, సంక్షేమం, పల్లె ప్రగతి- పట్టణ ప్రగతి, విద్య- ఉపాధి, బీజేపీ వైఫల్యాలు, స్థానిక అంశాలపై తీర్మానాలు చేయాలని ఆదేశించారు. వ్యవసాయరంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి , కాళేశ్వరం, మిషన్ కాకతీయ, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమాపై కూడా పార్టీ సమావేశంలో తీర్మానాలు చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగానికి, సామాజిక భద్రతకు చేపట్టిన కార్యక్రమాల పైన మరో తీర్మానం ప్రవేశపెట్టి చర్చించాలని నేతలకు సూచించారు. మహిళా సంక్షేమం, వృద్ధులకు ఆసరా పెన్షన్లు, వికలాంగులకు సంక్షేమ కార్యక్రమాలు ఇలా సమాజంలోని అన్ని వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రత్యేకంగా రాజకీయ తీర్మానం చేయాలన్నారు. అలాగే విద్య, ఉపాధి అనే అంశం పైన మూడో రాజకీయ తీర్మానాన్ని చేయాలనిసూచించారు. విద్యాభివృద్ధిపై ప్రత్యేకంగా ప్రసంగాలు ఉండాలని సూచించారు. టీఎస్ ఐపాస్ ద్వారా ప్రైవేటు రంగంలో వచ్చిన ఉపాధి అవకాశాలపైన ప్రత్యేకంగా చర్చించాలన్నారు.

ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి.. దాదాపు రెండు లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న తీరుపైన కూడా ప్రత్యేకంగా ప్రస్థావన చేయాలన్నారు. మెడికల్ , నర్సింగ్ కాలేజీలు, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ వంటి ఉన్నత విద్య సంస్థల ఏర్పాటు వంటి అంశాల్లో అడుగడుగునా చూపిస్తున్న వివక్ష పైన కూడా రాజకీయ తీర్మానం చేసి కేంద్ర తీరును ఎండగట్టాలని సూచించారు. నాల్గవ రాజకీయ తీర్మానంగా పల్లె ప్రగతి - పట్టణ ప్రగతి ద్వారా అటు పట్టణాలు ఇటు పల్లెల్లో సాధించిన సమగ్ర ప్రగతి పైన విస్తృతంగా చర్చించుకోవాలన్నారు. ఐదో రాజకీయ తీర్మానంగా కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు.

ఆరో రాజకీయ తీర్మానంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా పెండింగ్ లో పెట్టిన అంశాలు, విభజన హామీలు, స్థానిక ప్రజలు చేస్తున్న డిమాండ్లపై బీజేపీ వ్యవహరిస్తున్న వివక్షపూరిత వైఖరి వంటి అంశాలు ఈ రాజకీయ తీర్మానాలలో స్పష్టంగా ఉండాలన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా అన్యాయం, ఖమ్మం జిల్లాకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీని నెరవేర్చకపోవడం , వరంగల్ జిల్లాకు సంబంధించి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ , గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సీసీఐ , నిజామాబాద్ కి సంబంధించి పసుపు బోర్డు ఏర్పాటు వంటి కీలక హామీలను నెరవేర్చకుండా బీజేపీ చూపిస్తున్న వివక్షపై రాజకీయ తీర్మానాలు చేసి విస్తృతంగా చర్చించాలన్నారు.

దీంతోపాటు సిరిసిల్లకు మెగా పవర్ లూం క్లస్టర్, నారాయణపేటకు హ్యాండ్ లూం పార్కు ఏర్పాటు, మునుగోడులో ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, భువనగిరిలో ఎయిమ్స్ కార్యకలాపాలపై నిర్లక్ష్యం వంటి అంశాలు నెరవేర్చకపోవడంపై కేంద్రంలోని బీజేపీపై స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహంపై తీర్మానాలు చేయాలని కోరారు.

125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, రాష్ట్ర నూతన సచివాలయ భవనానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును పార్టీ వేదికపై చర్చించుకోవాలని కోరారు. కేసీఆర్ అంటే సంక్షేమం.. మోదీ అంటే సంక్షోభంగా ప్రజలు భావిస్తున్న అంశాన్ని పార్టీ ప్రతినిధుల సభలో తీర్మానించడంతోపాటు.. వచ్చే ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సర్వ సన్నద్ధం చేసేలా సభలను నిర్వహించాలని కోరారు.

Next Story