పర్యవరణ ప్రేమికులకు మంత్రి కొండా సురేఖ కీలక సందేశం

by Disha Web Desk 2 |
పర్యవరణ ప్రేమికులకు మంత్రి కొండా సురేఖ కీలక సందేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని, వన్యప్రాణుల మనుగడ, రక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. సాంకేతిక అభివృద్ధి, కొత్త ఆవిష్కరణలను వన్యప్రాణుల రక్షణ కోసం వాడాలనే సంకల్పంతో ఈ సారి ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ‘జీవ వైవిధ్యం, అన్ని ప్రాణుల మనుగడే సమతుల్యమైన ప్రకృతికి జీవనాధానం. అభివృద్ధి పేరిట అడవులు, ఇతర జంతుజాలం పట్ల మనుషుల వైఖరిలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి.

దీంతో వన్యప్రాణుల మనుగడపై తీవ్ర ఒత్తిడి చోటు చేసుకుంటోంది. మనతో పాటు రానున్న తరాలకు కూడా నివాసయోగ్యమైన పరిసరాలు కావాలంటే అన్ని జీవరాసుల మనుగడ, సహజీవన సూత్రాన్ని కొనసాగించాలి. మనుషులు, జంతువుల మధ్య సంఘర్షణ పెరుగుతోంది. జంతు ఆవాసాల్లో మనుషుల చొరబాట్ల వల్లే ఈ సమస్య వస్తోంది. దీనిని వీలైనంతగా తగ్గించటం మనందరి బాధ్యత. అలాగే మనుషుల నిర్లక్ష్యంతో జరుగుతున్న అటవీ అగ్నిప్రమాదాలను నివారించాలి. అటవీ మార్గాల్లో ప్రయాణాల్లో ప్రతీ ఒక్కరూ అప్రమత్తతతో వ్యవహరించాలి. ఎండాకాలం జంతువులు, పక్షుల నీటి వసతికి వీలైనంతగా అందరూ సహకరించాలి. అటవీ నేరాల అదుపుకు, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ నివారణకు ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలి. పర్యావరణ సమతుల్యత, జంతుజాలం, మనుషుల జీవనం పరస్పర ఆధారాలు. ఇందులో ఏ ఒక్కటి లోపించినా మిగతా వాటి జీవనంపై ప్రభావం పడుతుందన్న విషయాన్ని అందరూ గ్రహించాలి. బాధ్యతతో మెలగాలని ఆశిస్తున్నా’ అని కొండా సురేఖ పేర్కొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed