పోడు రైతులకు హాని తలపెట్టొద్దు.. అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం

by Gantepaka Srikanth |
పోడు రైతులకు హాని తలపెట్టొద్దు.. అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, వారి ఉపాధికి భంగం కలగకుండా అటవీశాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ పోడు భూముల రక్షణకు కృషి చేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. అదే సమయంలో పోడు భూముల్లో సాగుచేసుకుంటున్న రైతు కుటుంబాలు సున్నితమైన పరిస్థితుల్లో అటవీశాఖ అధికారులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దనీ, క్రమశిక్షణా చర్యలకు గురికావద్దని మంత్రి సురేఖ సూచించారు.

శనివారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్, అడిషనల్ సెక్రటరీ ప్రశాంతి, డిప్యూటీ సెక్రటరీ శ్రీలక్ష్మి, పీసీసీఎఫ్ డోబ్రియాల్, సీసీఎఫ్‌లు భీమా నాయక్, ప్రభాకర్, డీఎఫ్ఓలు రాహుల్ కిషన్ యాదవ్, కిష్టాగౌడ్, సిద్దార్థ్ విక్రంసింగ్, విశాల్, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.

పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతుల హక్కులను కాపాడడంలోనూ, అటవీశాఖ భూములను కాపాడే విధులను నిర్వర్తిస్తున్న అటవీ అధికారులకు రక్షణ కల్పించడంలోనూ ప్రభుత్వం ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నదని మంత్రి సురేఖ అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఏళ్ళుగా పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, వ్యవసాయం పేరుతో మార్గదర్శకాలకు, చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను ఆధీనంలోకి తీసుకున్నట్లైతే కఠినచర్యలు చేపట్టాల్సి వస్తుందని మంత్రి సురేఖ హెచ్చరించారు. నిన్న నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో ఎఫ్ఆర్ఓ, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ ల పై గిరిజనులు చేసిన దాడిని మంత్రి సురేఖ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో, రాష్ట్ర అటవీ సంపద, సహజ వనరుల పరిరక్షణకు అంతే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.Next Story

Most Viewed