‘మేడిగడ్డ’ పనికిరాదు! సెంట్రల్ సాయిల్ అండ్ మెటల్ రీసెర్చ్ శాస్త్రవేత్తల క్లారిటీ

by Disha Web Desk 4 |
‘మేడిగడ్డ’ పనికిరాదు! సెంట్రల్ సాయిల్ అండ్ మెటల్ రీసెర్చ్ శాస్త్రవేత్తల క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : మేడిగడ్డ బ్యారేజీ మొత్తం పనికి రాదనే అభిప్రాయానికి ఇంజినీరింగ్ నిపుణులు వచ్చినట్టు తెలుస్తున్నది. మంగళవారం మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను సెంట్రల్ సాయిల్ అండ్ మెటల్ రీసెర్చ్ స్టేషన్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశీలించారు. మేడిగడ్డలో కుంగిన పిల్లర్లతో పాటు బ్యారేజీ మొత్తాన్నీ పరిశీలించారు. మిగతా పిల్లర్ల కింద మెల్లమెల్లగా సమస్యలు తలెత్తుతున్నాయని వారి పరిశీలనలో వెల్లడైందని తెలుస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా పనికి రాదనే టాక్ ఇరిగేషన్ వర్గాల్లో మొదలైంది.

బ్యారేజ్ మొత్తం సమస్యనే

గతేడాది అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ 6వ పిల్లర్ కుంగిన విషయం తెలిసిందే. దీంతో సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం అధ్యయనం కోసం నేషనల్ డ్యామ్ సేప్టీ టీమ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ టీమ్ రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి వచ్చి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తనిఖీ చేయనున్నది. ఈలోపు బ్యారేజీ కింద సాయిల్ ఎలా ఉంది? పిల్లర్లు కుంగడానికి కారణాలు ఏంటీ? భవిష్యత్‌లో బ్యారేజ్‌కు ఏమైనా సమస్యలు వస్తాయా? అనే కోణంలో స్టడీ చేసేందుకు సెంట్రల్ సాయిల్ అండ్ మెటల్ రీసెర్చ్ స్టేషన్‌కు చెందిన సైంటిస్టులు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు.

బ్యారేజీలోని మిగతా పిల్లర్ల కింద ఉన్న ఇసుక మెల్లమెల్లగా కదిలిన విషయాన్ని వారు గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. బ్యారేజీలో పరిమితి కంటే ఎక్కువ నీటిని స్టోరేజీ చేయడం వల్ల ఈ సమస్య వచ్చిందని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఎత్తు పెంచి నిర్మించడం వల్ల పిల్లర్ల కింద ఉన్న సాయిల్‌లో కదలికలు వచ్చినట్టు సైంటిస్టులు అభిప్రాయ పడినట్టు సమాచారం.

బ్యారేజీ భవిష్యత్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ చేతుల్లో

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల భవిష్యత్ తేల్చే విషయంలో ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చింది. త్వరలో ఎన్‌డీఎస్‌ఏకు చెందిన టీమ్ అన్ని బ్యారేజీలను పరిశీలించి రిపోర్టు ఇవ్వనున్నాయి. ఆ రిపోర్టు అధారంగానే సమస్య వచ్చిన బ్యారేజీలను రిపేర్లు చేయడమా? లేదా? అనే క్లారిటీ వస్తుందని ఇరిగేషన్ శాఖ వర్గాలు వెల్లడించాయి.

Next Story

Most Viewed