వామ్మో సర్కారీ స్కూళ్ళు..?

by Kalyani |
వామ్మో సర్కారీ స్కూళ్ళు..?
X

దిశ, మేడ్చల్ బ్యూరో : విరిగిన గేట్లు.. ఊడిన తలుపులు.. కంపు కొడుతున్న మరుగు దోడ్లు.. మూత్రశాలలు, చెత్తా చెదారంతో నిండుకున్న అవరణలు.. దుమ్ము పట్టిన బెంచీలు..ఇది మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి.. ప్రభుత్వం మారినా.. సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. గత ప్రభుత్వం ‘మన ఊరు.. మన బడి’ ,ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ‘ అమ్మ ఆదర్శ పాఠశాల’ స్కీముల పేరిట సర్కారీ స్కూళ్ల అభివృద్ధి కోసం రూ. కోట్లు వెచ్చించిన బడుల స్థితి గతులు ఏ మాత్రం మారలేదు. నాసిరకం పనులతో కాంట్రాక్టర్లు, విద్యా శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ప్రభుత్వ బడుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.

మౌలిక వసతులకు రూ.12 కోట్లు

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 375 ప్రభుత్వ పాఠశాలు, 22 ప్రాథమికోన్నత పాఠశాలలు, 108 ఉన్నత పాఠశాలలు, 10 ఎయిడెడ్ పాఠశాలలు మొత్తం కలిపి 515 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘అమ్మ ఆదర్శ పాఠశాలలు’ స్కీమ్ లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.12.01 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో 286 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం అత్యవసర పనులు అనగా ఎలక్ట్రిసిటీ, తాగునీరు, మరుగు దోడ్లు, బాలికల మరుగుదోడ్లు, మైనర్ రిపేర్ పనులను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ జిల్లాలోని మెజారిటీ పాఠశాలలు సమస్యలతో సతమతమవుతున్నాయి.

ఉదాహరణకు కీసర మండలంలోని హరిజన వాడ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మరుగు దోడ్లు చెత్త చేదారం తో నిండిపోయాయి. మూత్రశాలలు నిండిపోయి కంపు కొడుతున్నాయి. పాఠశాల అవసరం అంతా చెత్త ,దుమ్ము ధూళితో నిండిపోయింది. పాఠశాల పరిశుభ్రత పై విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తల్లిదండ్రుల విజ్ఠప్తి మేరకు బుధవారం కీసర గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి స్థానికులతో కలిసి స్కూల్ ను సందర్శించగా, స్కూల్ లో అపరిశుభ్రత తాండవిస్తోంది.

తక్షణమే బాగు చేయాలి..శ్రీనివాస్ రెడ్డి


ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కీసర గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని 6 గ్యారంటీల హామిలిచ్చింది. నిధులన్ని ఉచితాలకు తరలిస్తోంది. విద్యా, వైద్యం కోసం నిధులను ఖర్చు చేయడంలేదు. అమ్మ ఆదర్శ పాఠశాల కోసం నిధులను కేటాయించినా.. ఖర్చు మాత్రం చేయడంలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతాం..

- శ్రీనివాస్ రెడ్డి, కీసర గ్రామ శాఖ అధ్యక్షుడు

Next Story