" చెత్త " నిర్వహణ పై పట్టింపేది…?

by Kalyani |
 చెత్త  నిర్వహణ పై పట్టింపేది…?
X

దిశ, ఘట్కేసర్: ఘట్కేసర్ మున్సిపాలిటీలో చెత్త నిర్వహణ అస్తవ్యస్తం గా తయారైంది. మున్సిపాలిటీ శివారులో ఏర్పాటు చేసిన పొడి చెత్త నిర్వహణ కేంద్రం నిరుపయోగంగా పడి ఉంది. మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులలో సేకరించిన చెత్తనంతా వాహనాల్లో తీసుకెళ్లి చెత్త నిర్వహణ కేంద్రం పక్కనే ఉన్న బహిరంగ భూమిలో కుప్పలుగా పోసి తగలేస్తున్నారు.

కాలుష్యమయంగా పర్యావరణం....

టన్నుల కొద్ది చెత్త పోయడంతో గుట్టలుగా ఏర్పడి ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతోంది. అంతేకాకుండా చెత్తను వేరు చేయకుండా నిప్పు రాజేసి మంట పెడుతున్నారు. నిత్యం ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో భయానకంగా తయారయింది. డంప్ యార్డ్ పరిస్థితిపై ఎన్నిసార్లు పత్రికలలో వార్తలు వచ్చిన అప్పటికప్పుడు అధికారులు స్పందించి తర్వాత పట్టించుకోకపోవడం శోచనీయం. అసలు మున్సిపాలిటీలో శానిటరీ, ఎన్విరాన్మెంటల్ అధికారులు ఇటువైపు రాకపోవడం గమనార్హం. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు తాము చెత్త నిర్వహణ విషయంలో సరైన చర్యలు తీసుకుంటామని రికార్డులు చూపించి చేతులు దులుపుకుంటున్నారు. చెత్త నిర్వహణ బాధ్యత స్వచ్ఛందంగా ఓ సామాజిక సేవా సంస్థ చేపట్టనుందని మూడు నెలల క్రితం మున్సిపల్ అధికారులు తెలిపారు. కానీ ఇప్పటివరకు ఏ సంస్థ కూడా ఇటువైపు రాకపోవడం గమనార్హం.

శవాలను తెచ్చి పాతేస్తున్నారు...

ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో గత నెల మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ ను హత్య చేసి ఘట్కేసర్ చెత్త డంప్ యార్డులో పాతేశారు. చెత్త డంప్ యార్డ్ పరిసర ప్రాంతాలు భయానకంగా ఉండటం. అటువైపు రాకపోకలు తక్కువగా ఉండటం హంతకులకు కలిసి వచ్చింది. వారం రోజుల తర్వాత శవాన్ని వెలికి తీశారు. ఆ సమయంలో మున్సిపల్ అధికారులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలు అందరూ అక్కడే ఉన్నారు. చెత్త డంప్ యార్డ్ పరిస్థితి కళ్ళకు కట్టినట్టు కనిపించినా ఎవ్వరూ ఇప్పటివరకు పట్టించుకోలేదు.

మున్సిపల్ అధికారులు పట్టించుకోవాలి...

చెత్త డంప్ యార్డ్ పరిస్థితిపై ముఖ్యంగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర వీడి చెత్త నిర్వహణపై సరైన చర్యలు తీసుకోవాలని లేకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్థానిక ప్రజా సంఘాలు, యువజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Next Story

Most Viewed