గోప్యత ఎందుకు...? వ్యాక్సన్ స్కూల్‌‌పై విద్యాశాఖ మీనమేషాలు

by Aamani |
గోప్యత ఎందుకు...? వ్యాక్సన్ స్కూల్‌‌పై విద్యాశాఖ మీనమేషాలు
X

దిశ,మేడ్చల్ బ్యూరో: వ్యాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ అనుమతుల గోప్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్కూల్ అనుమతులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించకుండా మేడ్చల్ జిల్లా విద్యాశాఖ ఎందుకు గోప్యత పాటిస్తుందని పేరెంట్స్ సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. ఐదు దశాబ్దాలకు పైబడిన పురాతన భవనంలో ఇంటర్నేషనల్ స్కూల్ కి ఎలా ..? అనుమతులు ఇచ్చారని నిలదీస్తున్నాయి.కుత్బుల్లాపూర్ హెచ్ఎంటీ కాలనీలోని వ్యాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ అనుమతుల విషయమై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

గోప్యతపై మర్మమేమిటి..?

కుత్బుల్లాపూర్ హెచ్ఎంటి కాలనీ లోని పాత బిల్డింగ్ ను వ్యాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం లీజుకు తీసుకుంది.స్కూల్ భవనానికి ఒకవైపు మరమ్మత్తులు చేపడుతూనే.. మరో వైపు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద చేతుల మీదుగా హడావిడిగా స్కూల్ ప్రారంభోత్సవం చేశారు. ఇప్పటికీ ఇంకా సివిల్ వర్క్ నడుస్తూనే ఉంది. ఈ విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు తీసుకుంటున్నారు.స్కూల్ భవన నిర్మాణాలు పూర్తి కాకుండా.. జిల్లా విద్యాశాఖ అనుమతులు ఎలా ఇచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. అయితే స్థానికులు కొందరు అనుమానం వచ్చి స్కూల్ అనుమతుల విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా మండల విద్యాశాఖ అధికారులను సమాచారం అడిగారు.

దీనిపై మండల విద్యాశాఖ ఇదిగో.. అదిగో అంటూ కాలయాపన చేస్తుండడంతో జిల్లా విద్యాశాఖ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి సమాచారాన్ని త్వరితంగా ఇవ్వాలని ఎంఈఓ ను ఆదేశించారు. రెండు నెలలుగా ఇదే ధోరణిలో విద్యాశాఖ అధికారులు వ్యవహారిస్తున్నారే తప్ప.. సదరు పౌరులు అర్టీఐ ద్వారా అడిగిన సమాధానం మాత్రం ఇవ్వడం లేదు. దీంతో విద్యాశాఖ తీరుపై అనుమానాలు బలపడుతున్నాయి. స్కూల్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ విద్యాశాఖ సమాచారాన్ని ఇవ్వకుండా దాటవేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే ఈ పాఠశాలలో ఫైర్ సేఫ్టీ సిస్టం లేదు. ఫైర్ సేఫ్టీ లేని పాఠశాలకు ఎన్ఓసి ఏ విధంగా వస్తుంది..? అనుమతులు ఏ విధంగా విద్యాశాఖ అధికారులు ఇచ్చారు అనే విషయంపై స్పష్టత లేనేలేదు.

రూ.లక్షల్లో ఫీజు..

ఇక ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫీజు కూడా అదే స్థాయిలో ఉన్నది. పిపి వన్, పిపి 2 ల స్టాండర్డ్ లోనే రూ. 84 వేలు వసూలు చేస్తున్నారు. అన్యువల్, రిజిస్ట్రేషన్ ఫీజు లకు ఇతరత్రా విధులను జోడించి మరో రూ.37 వేలు వసూలు చేస్తున్నారు. ఇక ట్రాన్స్పోర్ట్ ఫీజు కిలోమీటర్ల చొప్పున రెండు కిలోమీటర్ల అయితే రూ.14 వేలు, ఐదు కిలోమీటర్ల వరకు అయితే రూ.24 వేలు, 10 కిలోమీటర్ల వరకు రూ. 36 వేల చొప్పున బాదుతున్నారు. స్కూల్ బుక్స్, స్కూల్ డ్రెస్ లు అదనంగా పేరెంట్స్ నుంచి వసూలు చేస్తున్నారు.

Advertisement

Next Story