సీలింగ్ భూముల స్వాధీనానికి కసరత్తు...

by Disha Web Desk 23 |
సీలింగ్ భూముల స్వాధీనానికి కసరత్తు...
X

దిశ,ఘట్కేసర్ : ప్రభుత్వ సీలింగ్ భూముల స్వాధీనానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఘట్కేసర్ మండల రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు. వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చిన ప్రభుత్వ భూముల్లో వెంచర్లు చేసి అమ్ముకున్న భూముల డేటాను సేకరించిన రెవెన్యూ అధికారులు ఆ భూములు స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. మండల పరిధిలోని ప్రతాపసింగారం, కాచవాని సింగారం, కొండాపూర్, అన్నోజిగూడ, ఘనపూర్ ఫకీర్ టెక్యా గ్రామాల్లోని ప్రభుత్వ భూములలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కాగా కొండాపూర్ గ్రామంలోని దాదాపు 68 ఎకరాల సీలింగ్ భూమిలో నందీశ్వర హౌసింగ్ కాలనీ ఏర్పడినట్లు రెవెన్యూ రికార్డులను నమోదయింది. ఈ భూముల సీలింగ్ పట్టాదారులు 25 మంది రైతులకు పీఓటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్) కింద గత నెల 26 వ తేదీన నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ సీలింగ్ భూములు ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో నోటీసు అందిన 15 రోజుల్లోగా రైతులు సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.

సీలింగ్ పట్టాదారుల్లో మొదలైన టెన్షన్...

కొండాపూర్ రైతులకు పి ఓ టి నోటీసులు జారీ అయిన విషయం తెలుసుకున్న మిగతా గ్రామాలలో సీలింగ్ పట్టాదారుల్లో భయాందోళన మొదలైంది. ఎలాగైనా సీలింగ్ భూములను రక్షించుకునే ప్రయత్నంలో మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మండల అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రజా ప్రతినిధులతో ముందస్తు పైరవీలు చేయించుకుంటున్నట్లు సమాచారం.

రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు...

కొందరు సీలింగ్ పట్టాదారులు రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీలింగ్ భూముల స్వాధీనం వ్యవహారంలో బడుగు బలహీన వర్గాల రైతులకు నోటీసులు ఇచ్చిన రెవెన్యూ అధికారులు.. మండల రెవెన్యూ పరిధిలో యమనంపేట గ్రామంలో సీలింగ్ భూముల స్వాధీనం విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, పి ఓ టి నోటీసులు ఎందుకు జారీ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కావాలని నోటీసులు ఇచ్చి బెదిరింపులకు గురి చేసి లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని డబ్బులు దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అందరికీ సమ న్యాయం ఉండాలని, మండల రెవెన్యూ అధికారుల తీరుపై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

సీలింగ్ భూములు దుర్వినియోగం చేస్తే నోటీసులు తప్పనిసరిగా ఇస్తున్నాం : డిప్యూటీ తహసీల్దార్, సందీప్ కుమార్ రెడ్డి..

మండల పరిధిలో దుర్వినియోగమైన ప్రభుత్వ సీలింగ్ భూముల డేటాను సేకరించాం. జాబితా వారిగా అందరికీ పీఓటీ నోటీసులు అందజేస్తున్నాం. రైతులు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వక పోయినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదు.


Next Story