కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

by Aamani |
కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
X

దిశ ప్రతినిధి,మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలోని ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల అధికారులు శుక్రవారం పరిశీలించారు. మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ పోట్రు, రాచకొండ పోలీస్ కమిషనర్ డి ఎస్ .చౌహన్ ,జిల్లా పరిశీలకులు ఎస్.కె.జైన్, పూర్వా గార్గ్, అమన్ మిట్టల్ లు కీసర మండలంలోని బోగారం హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఓట్ల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ జిల్లా ఎన్నికల అధికారులు యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరపాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది రాకపోకలకు, అభ్యర్థులు, ఏజెంట్ల రాకపోకల కోసం వేర్వేరు మార్గాలతో ఏర్పాటు చేసిన బారికేడ్లను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, కౌంటింగ్ టేబుల్స్, ఇతర అన్ని ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు.కౌంటింగ్ ప్రక్రియ కు ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా సాఫీగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్నికల నిర్వహణ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ మాట్లాడుతూ..డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి , డీసీపీ జానకి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed