గంప గుత్తగా ఓట్లకు గాలం.. మల్కాజిగిరిలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రత్యేక నజర్

by Disha Web Desk 23 |
గంప గుత్తగా ఓట్లకు గాలం.. మల్కాజిగిరిలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రత్యేక నజర్
X

దిశ,మేడ్చల్ బ్యూరో : దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి. ఇంటింటికి వెళ్లి ఓట్లు అడగడం అంతా ఈజీ కాదు. మరోవైపు పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. ఈ లోగ ఓటర్లను మరింత ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు రకరకాల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులైన ఈటల రాజేందర్, పట్నం సునీత మహేందర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డిలు తమదైన శైలిలో అనుయాయులను రంగంలోకి దింపారు. ఎలాగోలా ఓటర్లను బుట్టలో వేసుకునే పని మొదలు పెట్టారు. ఒకవైపు ద్వితీయ శ్రేణి నేతలను అప్రమత్తం చేస్తూనే మరోవైపు గంప గుత్త ఓట్ల వేటలో పడ్డారు. కుల,మత, ఉద్యోగ, కాలనీ, కార్మిక ఇలా రకరకాల సంఘాల ఓట్లపై గురి పెట్టి గాలం వేస్తున్నారు. వారి ప్రత్యేక సమావేశాలకు హాజరై ఓట్ల శాతం పెంపుకు కసరత్తు చేస్తున్నారు.

37 లక్షల ఓటర్లు..

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోనే అతి పెద్దది గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 37 లక్షల 28 వేల 417 మంది ఓటర్లు ఉన్నారు.ఈ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఒక కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో 7 లక్షల 12 వేల 759 మంది ఓటర్లు ఉన్నారు. దేశంలోనే అనేక పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఓటర్ల కంటే తక్కువగా ఉన్నట్లు సమాచారం ఉంది. ఇక పోతే కంటోన్మెంట్ మినహా మిగతా ఐదు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 5 లక్షల కంటే అధికంగా ఓటర్లు ఉన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరున్నర లక్షల ఓటర్లు ఉండగా, ఎల్ బి నగర్ లో 6 లక్షలు, ఉప్పల్ లో 5.33 లక్షలు,మల్కాజిగిరిలో 4.99 లక్షలు, కంటోన్మెంట్ లో 2.50 లక్షల ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 3228 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న 37 లక్షల ఓటర్లను ఏ అభ్యర్థి కలవడం అంత సులభం కాదు.దీంతో గంప గుత్త ఓట్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి సారించారు.

సంఘాలతో మమేకం..

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచార శైలి లో దూసుకుపోతున్నారు. మిగతా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థలకంటే ప్రచారపర్వంలో ముందున్నారు. ఎప్పటికప్పుడు తన రాజకీయ ఎత్తు గడలను మారుస్తున్నారు. తాజాగా కుల సంఘాలు, రకరకాల యూనియన్ల వైపు దృష్టి సారిస్తున్నారు. లోక్ సభ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో కులాల వారీగా ఉన్న సంఘాలు కొన్ని ప్రాంతాల్లో లక్ష్య సాధన కోసం చురుగ్గా పనిచేస్తున్నాయి. ఉదాహరణకు ఎమ్మార్పీఎస్ ఈటల రాజేందర్ గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తోంది.రాజేందర్ సైతం కేంద్ర ప్రభుత్వంతో పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో లబ్ది పొందిన వారిని టార్గెట్ చేస్తున్నారు.

ఇటీవల కంటోన్మెంట్ లో మాజీ సైనికులతో నిర్వహించిన సమావేశం సక్సెస్ అయ్యింది. విశ్వ కర్మల ఆత్మీయ సమ్మేళనం లాంటి రకరకాల సంఘాలతో మమేకమవుతూ.. ఓటర్లను రాబట్టేందుకు యత్నిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహిళ, కాలనీ అసోసియేషన్లు, సెటిలర్లు, రెడ్డి సంఘం నేతలతో తరచూ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసి ఇతర పార్టీల లీడర్లను తమ పార్టీలోకి చేర్చుకోని తమ బలాన్ని పెంచుకుంటోంది.ఇక బీఆర్ఎస్ పార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేలున్నారు. అయినా ఎన్నికల ప్రచార పర్వంలో వెనకంజలో ఉన్నట్లు పార్టీ శ్రేణులే చెబుతున్నారు. కేవలం ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు, కీలక నేతలతో సమావేశాలు నిర్వహిస్తోంది.

ప్రభావశీల ఓటర్లను ఫోన్ కాల్స్..

స్థానికంగా ఓటు బ్యాంకు కలిగి ఉన్న ప్రభావశీల ఓటర్లపై పార్లమెంట్ అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఓ రోజుకా రోజు ఓటర్ల మనోగతంపై అంచనా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అవసరమైతే కలిసిన ఓటర్లను ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. వీలైతే అభ్యర్థితోనూ మాట్లాడిస్తున్నారు. అభ్యర్థుల మెజారిటీ లక్ష్యంగా ఓట్లను ప్రభావితం చేసే లీడర్లతో మాట్లాడుతున్నారు. తమకు ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని మీకు ఏ పని కావాలన్నా చేసి పెడతామని హామీ ఇస్తున్నారు. కష్టమొచ్చిన తన తలుపు తట్టోచ్చని,ఓటర్లతో మాట్లాడుతూ.. ప్రచారాన్ని కొంత పుంతలు తొక్కిస్తున్నారు.



Next Story

Most Viewed