కరోనా కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉన్నా

by Disha Web Desk 15 |
కరోనా కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉన్నా
X

దిశ, కూకట్​పల్లి : కరోనా కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉండి సేవలు అందించానని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్​ అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలో శనివారం ఈటెల రాజేందర్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫతేనగర్​లో మార్నింగ్​ వాకర్స్​తో కలిసి వాకింగ్​ చేశారు. అనంతరం మూసాపేట్​లోని స్వాన్​ లేక్​ అపార్ట్​మెంట్​ వాసులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్​ మాట్లాడుతూ తెలంగాణ మలి దశ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డను, ఆర్థిక శాఖ మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రజలకు కరోనా వంటి కష్టకాలంలో సేవలు అందించానని అన్నారు. మొట్టమొదటి కరోనా రోగిని నేరుగా కలిసిన దేశంలోనే ఏకైక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని తాను అని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమయిందని అన్నారు.

మోదీ నాయకత్వంలో దేశంలో 4 కోట్ల ఇండ్లు కట్టించారని అన్నారు. 12 కోట్ల టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడింది ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. 11 వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానంలో ఉంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని, ప్రధాని మోడీదేనని అన్నారు. రామ మందిరాన్ని నిర్మించి మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడింది బీజేపీ అని అన్నారు. ప్రశ్నించే గొంతుకను గెలిపించండి అని అంటే మల్కాజిగిరి ప్రజలంతా రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి ఎంపీగా

గెలిపిస్తే ఎన్నడూ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కనిపించలేదని ఆరోపించారు. రాష్ట్రాలకు ట్యాక్స్​ డెవల్యూషన్​ 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిన ఘనత ప్రధాని మోడీది అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నేరుగా గ్రామాల్లో, పట్టణాలలో అమలు చేస్తున్నారని అన్నారు. మల్కాజిగిరి ఎంపీగా తనను గెలిపించాలని, ప్రజలకు కావలసిన అభివృద్ధి, సంక్షేమాన్ని అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్​పల్లి ఇన్​చార్జి మాధవరం కాంతారావు, వడ్డేపల్లి రాజేశ్వర రావు, పాపయ్య గౌడ్, సురేందర్ రెడ్డి, శంకర్ రెడ్డి, కార్పొరేటర్ మహేందర్, శ్రీకర్ రావు, కృష్ణగౌడ్, కంచి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed