త్రిముఖ పోరులో గెలుపెవరిదో.. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ వంశా తిలక్

by Disha Web Desk 23 |
త్రిముఖ పోరులో గెలుపెవరిదో.. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ వంశా తిలక్
X

దిశ,కంటోన్మెంట్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్.వంశా తిలక్ పేరును బీజేపీ ఖరారు చేసింది. మాజీ మంత్రి సదాలక్ష్మి , పద్మశ్రీ అవార్డు గ్రహిత టివి నారాయణ కుమారుడే వంశా తిలక్.బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ఇప్పటికే తన అభ్యర్థిగా లాస్య నందిత సోదరి నివేదితను బరిలోకి దింపింది. గత శాసనసభ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. దీంతో శ్రీ గణేష్ కే కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. లోక్ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు.

ఉత్కంఠకు తెర..

కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. బీజేపీ టికెట్ కోసం హేమా హేమీలు పోటీ పడ్డారు. ఈ తరుణంలో తమ అభ్యర్థిగా డాక్టర్ వంశా తిలక్ ను ఖరారు చేస్తూ ఆ పార్టీ నాయకత్వం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన టిఎన్ సదా లక్ష్మి కుమారుడైన వంశా తిలక్ , వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. కంటోన్మెంట్ నుంచి పోటీ చేసేందుకు బీజేపీకి చెందిన పలువురు నేతలు ఆసక్తి కనబర్చినా, సామాజిక, రాజకీయ అంశాల దృష్ట్యా వంశా తిలక్ నే ఈ పార్టీ నాయకత్వం ఖరారు చేసింది.

ముక్కోణపు పోటీ..

కంటోన్మెంట్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదితను బీఆర్ఎస్ రంగంలోకి దింపి, సెంటిమెంట్ అస్త్రంతో మరోసారి గట్టెక్కాలని చూస్తోంది. మొదట కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న 2023, ఫిబ్రవరిలో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. అనంతరం 2023,నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చిన్న కుమార్తె లాస్య నందితకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించగా, ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడు నెలలకే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.ఇలా కంటోన్మెంట్ గత ఇద్దరు ఎమ్మెల్యేలు పదవిలో ఉండగానే చనిపోయారు. దీంతో లాస్య నందిత సోదరి, సాయన్న రెండో కుమార్తె నివేదితకు పార్టీ అధినేత కేసీఆర్ టికెట్ ను కేటాయించారు.

2018,2023లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన శ్రీ గణేష్ కి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, టికెట్ కేటాయించింది. రెండు సార్లు ఓటమి పాలైన శ్రీ గణేష్ ని కంటోన్మెంట్ ఓటర్లు సానుభూతితో గట్టేక్కిస్తారని పార్టీ నమ్ముతుంది.

తాజాగా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన డాక్టర్ వంశా తిలక్ ను బీజేపీ రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించింది. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాల సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి టికెట్లు ఇవ్వగా, బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వంశా తిలక్ ను బరిలో దింపింది.దీంతో ఈ మూడు ప్రధాన పార్టీలు అచితూచి అభ్యర్థులను బరిలోకి దింపగా, ముక్కోణపు పోటీకి తెరలేసింది.


Next Story