బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలి: కలెక్టర్ హరీశ్

by Disha Web Desk 21 |
బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలి: కలెక్టర్ హరీశ్
X

దిశ ప్రతినిథి,మేడ్చల్: బతుకమ్మ వేడుకలను ఆనందోత్సహాల మధ్య, అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.హరీశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల మహిళ ఉద్యోగులు ప్రతి రోజు బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ నెల 25వ తేదీన ఎంగిలిపూలతో ప్రారంభం కానున్న బతుకమ్మ వేడుకలు అక్టోబర్ 3వ తేదీన సద్దుల (పెద్ద) బతుకమ్మను ఘనంగా జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించిందన్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం.. గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలలోనే కాకుండా భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను ప్రచారం చేయడం జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ గుర్తు చేశారు. కోవిడ్–19 నేపథ్యంలో బతుకమ్మ పండుగను రెండేళ్ళ పాటు పెద్ద ఎత్తున జరుపుకోలేకపోయామని,ఈ ఏడాది ఘనంగా నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్ తెలిపారు. అలాగే సద్దుల బతుకమ్మతో పాటు అంతకు ముందు వచ్చే బొడ్డెమ్మ బతుకమ్మల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

ఈ విషయంలో లైన్ డిపార్టుమెంట్, సభ్యుల సమన్వయంతో.. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని.. స్వయం సహాయక బృందం, మహిళా ప్రజాప్రతినిధులు ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు సవివరమైన కార్యక్రమాలతో రోజు వారీ షెడ్యూల్‌ను సిద్ధం చేయడంతో పాటు నీటి వనరులు, రోడ్లు మొదలైన వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని తెలిపారు.

ఆరుగురితో కమిటీ

బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆరుగురు అధికారులతో కమిటీ వేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించనుండగా.. జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి పద్మ, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అభివృద్ధి అధికారిణి ఝాన్సీరాణి, జిల్లా సంక్షేమాధికారిణి పావని, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు.

ఈ మేరకు కమిటీ సభ్యులందరూ ప్రతి రోజూ సమన్వయం చేసుకొంటూ సద్దుల బతుకమ్మ పండగైన అక్టోబర్ 3వ తేదీ వరకు ప్రత్యేకంగా అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని.. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. బతుకమ్మ ఉత్సవాల్లో ఆయా శాఖలకు సంబంధించిన వారు శాఖలకు ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని కలెక్టర్ హరీశ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ చివరి రోజున నిమజ్జనం చేసే సమయంలో ఆయా చెరువులు, కుంటల వద్ద లైటింగ్, శానిటైజేషన్ ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చూడాలని కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు.


Next Story

Most Viewed