అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ గా కాప్రా సర్కిల్..

by Disha Web Desk 11 |
అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ గా కాప్రా సర్కిల్..
X

దిశ, కాప్రా: అక్రమ నిర్మాణాలకు కాప్రా సర్కిల్ అడ్డాగా మారుతోంది. నిబంధనలను ఉల్లంఘించి విచ్ఛల విడిగా చేపడుతున్న నిర్మాణాలను అడ్డుకునే నాధుడే కరువయ్యారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడి అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తూ అందిన కాడికి దండుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేపడుతున్న నిర్మాణాలకు తీసుకున్న అనుమతులకు ఎలాంటి పొంతన లేకుండా ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్న అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

కాప్రా, ఏఎస్ రావునగర్, చర్లపల్లి, డివిజన్ లలోని పలు ప్రాంతాల్లో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవన రుషీ టౌన్ షిప్ లో వెలుస్తున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ, కాలనీ సోసైటీ సభ్యులే అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు చేపట్టక పోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఆగని అదనపు అంతస్తుల నిర్మాణాలు..

కాప్రా, ఏఎస్ రావునగర్, చర్లపల్లి డివిజన్ ల పరిధిలోని పలు కాలనీల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. జీ ప్లస్ టూలకు అనుమతులు తీసుకుని సెల్లార్ తో పాటు అదనపు అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. భవన రుషీ కాలనీ, కాప్రా హై టెన్షన్ లైన్, చర్లపల్లి ప్రాంతాల్లో అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్న నిర్మాణాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ణప్తి చేస్తున్నారు.

రోడ్డు కబ్జాపై మాజీ కౌన్సిలర్ ఫిర్యాదు..

చర్లపల్లి డివిజన్ శివ సాయినగర్ కాలనీలో సీసీ రోడ్డును కబ్జా చేసి అక్రమంగా నిర్మిస్తున్న ఇంటిపై మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకుడు కాసుల రవీందర్ గౌడ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఉప కమిషనర్ శంకర్ ను కలిసి అక్రమంగా నిర్మిస్తున్న ఇంటిపై, రోడ్డు కబ్జాపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. శివ సాయి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 4 లో ప్లాటు చుట్టూ ఉన్న మూడు వైపులా సీసీ రోడ్డును యథేచ్చగా కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు.


Next Story

Most Viewed