బడా బిల్డర్ బరితెగింపు.. నిబంధనలకు పాతర.... అక్రమ నిర్మాణాల జాతర

by Disha Web Desk 23 |
బడా బిల్డర్ బరితెగింపు.. నిబంధనలకు పాతర.... అక్రమ నిర్మాణాల జాతర
X

దిశ,దుండిగల్ : చట్టాలను చుట్టలుగా చేసుకుంటూ బౌరంపేట కు చెందిన ఓ బడా బిల్డర్ అక్రమ నిర్మాణాలు సాగిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కంజర్వేషన్ జోన్ లో ఎటువంటి అనుమతులు లేకుండా ఇప్పటికే ఆరు విల్లాల నిర్మాణం చేపట్టిన సదరు బిల్డర్ మరో అడుగు ముందుకేసి 500 గజాల స్థలంలో 6 అంతస్తుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు వెనకడుగు వేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తుంది.కంజర్వేషన్ జోన్ లో అనుమతులు పొందాలంటే 5 గురు మంత్రులతో కూడిన క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి లేదా పూర్తి స్థాయిలో ఎల్ ఎస్ కట్టిఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా అక్రమనిర్మానులు చేపడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

నిబంధనలకు పాతర..

కంజర్వేషన్ జోన్ లో నిర్మాణాలు చేపట్టాలంటే క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి. బౌరంపేట గ్రామ పరిధిలోని ఆర్కే టౌన్షిప్ ని ఆనుకొని సుమారు 2 ఎకరాల కంజర్వేషన్ జోన్ లో నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓ బడా నిర్మాణ సంస్థ అక్రమ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.సదరు బిల్డర్ గతంలో ఇదే తరహాలో గ్రామంలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతి సంపాదనకు అలవాటు పడ్డ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ముడుపులతో సరిపెడుతూ అక్రమ నిర్మాణదారునికి పరోక్షంగా సహకరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో పూర్తి స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారి లేకపోవడం, కింది స్థాయి సిబ్బంది చెప్పిందే వేదం అన్నట్లుగా సాగింది.

స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో

స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సహకారంతోనే సదరు నిర్మాణదారులు బరితెగిస్తున్నట్లు సమాచారం. కాసులకు కక్కుర్తి పడుతున్న దుండిగల్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమనిర్మాణదారునికి పరోక్ష సహకారం అందిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవు : మున్సిపల్ అధికారులు

దుండిగల్ మున్సిపాలిటీ లోని బౌరంపేట ఆర్కే టౌన్షిప్ ఆనుకొని కంజర్వేషన్ జోన్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్ కె.సత్యనారాయణ ను,టిపిఓ సంజున ను దిశ ప్రతినిధి వివరణ కోరగా బౌరంపేట గ్రామ పరిధిలోని ఆర్కే టౌన్షిప్ కి ఆనుకొని ఉన్న కంజర్వేషన్ జోన్ లో జరుగుతున్న నిర్మాణాలకు మున్సిపల్ నుంచి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదన్నారు,విచారణ చేపడుతామన్నారు.చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు,ఒకటి రెండు రోజుల్లో పూర్తి సమాచారం సేకరిస్తామన్నారు.


Next Story