ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

by Disha Web Desk 13 |
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీన ప్రారంభం కానున్న పరీక్షలకు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 1,18,935 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 133 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మే 24 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులను గంట ముందే ఎగ్జామినేషన్ హాల్లోకి పంపుతామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఫస్టియర్‌ పేపర్లకు సెకండియర్‌లో ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకొనే అవకాశాన్ని ఇంటర్ బోర్డు కల్పించింది. కొవిడ్ 19 కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న పరీక్షలు కావడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వడంతో పాటు ప్రశ్నలకు ఇచ్చే ఛాయిస్ లను పెంచారు.

జిల్లాలో ఏర్పాట్లు పూర్తి..

పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యం, పారిశుధ్యం, ఫర్నీచర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం జిల్లా ఇంటర్మీడియట్ అధికారులతో సమీక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉన్నందున, పరిసర ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ షాపులు మూసివేస్తామని, పరీక్షలలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. నిరంతర పర్యవేక్షణ కు ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.

పరీక్షలకు హాజరు ఇలా..

ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరంలో జనరల్ 62,342 మంది విద్యార్థులు, ఒకేషనల్ కోర్సులో 1,452 మంది మొత్తం 63,794 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్ 54,146 మంది, ఒకేషనల్ కోర్సులో 995 విద్యార్థులు మొత్తం 55.141 పరీక్షలు రాయనున్నారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా జనరల్లో 1,16,488 మంది, ఒకేషనల్ కోర్సులో 2,447 మంది విద్యార్థులు మొత్తం 1,18,935 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు.

ఇప్పటివరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకొని విద్యార్థులు నేరుగా ఇంటర్మీడియట్ వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు కంట్రోల్ రూమ్ నెంబర్ 040-27118584 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కిషన్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed