పేషెంట్ ను రూంలో వేసి చితకబాదిన వైద్యుడు

by Disha Web Desk 1 |
పేషెంట్ ను రూంలో వేసి చితకబాదిన వైద్యుడు
X

దిశ, నారాయణ ఖేడ్: ప్రభుత్వం రూ.కోట్ల ఖర్చు చేసి నిరుపేదల కోసం వైద్యం అందించాలనే సంకల్పంతో పని చేస్తుంటే వైద్యుల తీరు అందుకు పూర్తి భిన్నంగా ఉంది. వైద్యం కోసం వచ్చిన ఒక యువకుని వైద్యుడు రూంలో వేసి చితకబాదిన ఘటన నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రారం గ్రామానికి చెందిన పోస్ట్ మాన్ నాగయ్య కుమారుడు కాంట్రాక్టర్ డా.ఇజ్రాయేలు నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిలో వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఉన్న హట్ట్యానాయక్ తాండకు చెందిన మేఘవతు హన్మనాయక్ గ్రామంలో తన ఇంటిని పనులు చేస్తుండగా బలమైన రాయి కాలుపై పడింది. దీంతో చికిత్స నిమిత్తం హన్మనాయక్ ఏరియా ఆసుపత్రికి వచ్చాడు. అంతకు ముందు తన భార్య మేఘావత్ చాంగుబాయి తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. తన భార్య చెంత ఎవరూ లేరని, తనకు సెలైన్ పెడుతున్నారని.. తనకు తొందరగా ఓపీ చిట్టి తీసుకొని క్యూలో గంటకు పైగానే ఉన్నానని వైద్యుడితో తెలిపాడు.

దీంతో ఆ వైద్యుడు ఆసుపత్రిలో ఉన్న వాచ్ మెన్ సత్తయ్య చేతిలో ఉన్న కర్రను తీసుకొని హన్మనాయక్ ను రూంలోకి తీసుకెళ్లి ఇష్టానుసారంగా కొట్టాడు. దీంతో హన్మనాయక్ రెండు చేతులకు, కాళ్లకు గాయలయ్యాయి. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. అనంతరం కాంగ్రెస్ నాయకులకు అతనితో పాటు ఆసుపత్రికి వెళ్లి ఆసుపత్రికి వచ్చిన రోగులను కొట్టడం ధర్మం కాదని వైద్యునికి హితవు పలికారు. దీంతో బాధితుడు హన్మనాయక్ తనను కొట్టిన వైద్యునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. వైద్యుడు కొడుతున్నా తన పక్కనున్న వాళ్లు కనీసం స్పందించలేదంటూ హన్మనాయక్ విలేకరుల ఎదుట బోరున విలపించాడు.

Next Story

Most Viewed