కాంగ్రెస్ కొడుకులకు అహంకారం నెత్తికెక్కింది

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ కొడుకులకు అహంకారం నెత్తికెక్కింది
X

దిశ, మెదక్ ప్రతినిధి : కాంగ్రెస్ కొడుకులకు అహంకారం నెత్తికి ఎక్కి భూమి మీద ఉండడం లేదని, ఎన్నికల్లో ఆ పార్టీని ఓడిస్తే భూమి మీదకు వస్తారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ కు మద్దతుగా వచ్చిన ప్రజలతో మెదక్ రాందాస్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ పై ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బాండ్ పేపర్లతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులైనా ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. బాండ్ పేపర్ పరువు సీఎం రేవంత్ రెడ్డి తీశారన్నారు. ఇప్పుడు దేవుళ్లను రాజకీయాలకు సీఎం వాడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నేతల బట్టేబాజ్ మాటలు నమ్మరని పేర్కొన్నారు.

అలవి కాని అనేక జుఠా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే మెడలు వంచి అమలు చేయిస్తామని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో మరో సారి ప్రజలను మోసం చేసేందుకు దేవుళ్ల పై ప్రమాణం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆగస్టు 15 వరకు ఇచ్చిన హామీలు అమలు చేస్తానన్న సీఎం తనతో చాలెంజ్ కు ముందుకు రావాలని సవాల్​ విసిరారు. అమరవీరుల స్థూపం వద్దకు సీఎం వచ్చి చాలెంజ్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన బాండ్ పేపర్ల హామీలు అమలు చేసింది నిజమైతే రాజీనామా లేఖలు మేధావుల చేతుల్లో పెట్టేందుకు తాను సిద్ధమని సవాల్ చేశారు. ఇందుకు సిద్ధమై దమ్ముంటే ముందుకు రావాలని, లేకుంటే తోక ముడిసినట్టే భావించాల్సి వస్తుందని అన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందనరావు బ్లాక్ మెయిలర్ అని, దుబ్బాక ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.

మెదక్ జిల్లాకు ఒక్క మెడికల్ కళాశాలను ఇవ్వని బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ టీవీ ఛానల్ లో ప్రజలకు పూర్తి సమాధానం లభించిందని, కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్ గజగజ వణుకుతుందని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన సమాధానంలో రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ 8 నుంచి 9 సీట్లు గెలుస్తుందని చెప్పారు. ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరు ఆరవ తరగతి చదివితే మరొకరు బ్లాక్ మెయిలర్ అయితే కలెక్టర్ గా చేసిన వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. మెదక్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే అభ్యర్థి వెంకటరామిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఎమ్మెల్యేలు ప్రభాకర్ రెడ్డి, సునీతా రెడ్డి, చింత ప్రభాకర్, దేవేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed