ఎన్నికల సమర శంఖారావం పూరించిన గులాబీ దళపతి

by Disha Web Desk 22 |
ఎన్నికల సమర శంఖారావం పూరించిన గులాబీ దళపతి
X

దిశ, హుస్నాబాద్: రెండు పర్యాయాలు హుస్నాబాద్ ప్రాంతం లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ ద్వారా ప్రజలు ఆశీర్వదించి బంపర్ మెజారిటీతో గెలిపించారు. మరొక్కసారి అవకాశం ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్ హుస్నాబాద్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలను ఉద్దేశించి కోరారు. ప్రజా ఆశీర్వాద సభ ద్వారా ప్రజల ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... 2018 సంవత్సరంలో 88 సీట్లతో గెలుపొందామని అదే ఉరవడిని ప్రజలు మళ్ళీ ఇచ్చి బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 9 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మీరు కళ్ళారా చూశారు. ఈ అభివృద్ధి గురించి మీ గ్రామాలలో చర్చించండి. ఎన్నికలు అలా వస్తాయి అలా పోతాయి రౌతేందో రత్నం ఏందో గుర్తించాలి. ఖచ్చితమైన స్పష్టమైన అవగాహనతోనే ఓటెయ్యాలి. ఓటు అనేది ప్రజల తలరాతను మారుస్తుంది. కనుకనే అభివృద్ధి చేసిన ప్రభుత్వాన్ని గెలిపించి మరింత ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. తెలంగాణలో ఒకప్పుడు వలసలు, కరువు, కరెంటు లేకపోవడం అనేక సమస్యలు ఉండేవి వీటన్నింటినీ పారద్రోలాలంటే ఏం చేయాలి అని సుమారు మూడు నెలల పాటు మేథోమధనం చేసి నిపుణుల సహాయంతో ప్రణాళికలు వేసుకుని అభివృద్ధి చేసుకున్నాము. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు మనమే నెంబర్ వన్. తలసరి ఆదాయంలో పారిశ్రామిక విద్యా విధానంలో మనకు పోటీలేరు సాటిరారు. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకపోయినా అన్నింటిని అధిగమించి అన్ని విధాలుగా అభివృద్ధిని సాధించాం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కొన్ని పార్టీలు సిగ్గు లేకుండా అడుగుతున్నాయి. మీకు సమయం ఇస్తే ఈ 70 సంవత్సరాల లో ఏం చేశారు అని మండిపడ్డారు. ఇప్పటికీ ఇంకా దేశంలో పేదరికం ఉండడం సిగ్గుచేటు ఈ విధాన లోపం ప్రతిపక్షాలవి.

పెన్షన్ అనేది దురదృష్టవశాత్తు ఆ కుటుంబంలోని వ్యక్తికి ఏదైనా జరిగితే ప్రభుత్వం ఆదుకునేది పెన్షన్. అందులో భర్త చనిపోయిన వారు ఇలాంటి వారి కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే అత్యధికంగా ఇస్తున్నాం. ఈ పెన్షన్ను రూ. 5000 చేస్తున్నాను. ఇలా ప్రతి నెలా రూ. 500 పెంచుకుంటూ అందరికీ మేలు చేస్తాం. రైతు బంధు ద్వారా రైతులను ఆదుకుంటున్నాం దీనిని సంవత్సరానికి రూ. 16,000 ఇచ్చుకుని ఆదుకుంటాం. ఒకప్పుడు ఎక్కడ చూసినా తోటలు ఎండిపోయి కరువు ప్రాంతంగా ఉండేది 500 లేదా 700 ఫీట్లు వేస్తే గాని బోర్లు పడేవి కావు. కానీ ఇప్పుడు చెక్ డ్యాములు ఆనకట్టలు నిర్మించుకొని వర్షం నుంచి వచ్చే ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకొని అభివృద్ధి చేసుకున్నాం. మహాసముద్రం గండి ద్వారా 15 గ్రామాలకు వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందుతుంది అలాగే భూగర్భ జలాలు కూడా అధికంగా పెరిగాయి నాణ్యమైన విద్యుత్తు ఇవ్వడం వల్ల పంట పొలాలు పచ్చగా ఉన్నాయి. మోటార్లు కాలే పరిస్థితి లేదు రైతులు ఎంతో ఆనందంలో ఉండి గ్యారంటీగా పంటలు పండించుకుంటున్నారు. కంటి నిండా నిద్రపోతున్నారు. ఈ గ్రామంలో చూసిన అద్భుతమైన పంటలు రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. దేశంలోనే అత్యధిక ధాన్యం పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అని గర్వంగా చెప్పుకోవచ్చు. అనూహ్య రీతిలో మిషన్ భగీరథ పనిచేస్తున్నది. దీని ద్వారా మహిళలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదికి వెళ్లే పరిస్థితి లేదు ఇంకా అభివృద్ధి జరిగినా ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద చల్లె ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి.



గౌరవెల్లి ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు పన్నాయి కోర్టులో కేసులు వేశాయి. అయినా మేం భయపడం. మళ్లీ ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి గెలిపించుకుంటే ఐదు ఆరు నెలల్లో పూర్తిచేసి నేనే దీనిని ప్రారంభించడానికి బాధ్యత తీసుకొని తప్పకుండా మళ్ళీ హుస్నాబాద్ ప్రాంతానికి వస్తానని అన్నారు. అదేవిధంగా శనిగరం ప్రాజెక్టును మరమ్మతులు చేసుకునే అభివృద్ధి చేసుకుంటామని కొత్తకొండ ఆలయాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామని ముల్కనూర్ బస్టాండ్ కు మంజూరు కావాలని అడిగారు. దానిని కూడా తప్పకుండా మంజూరు చేస్తామని ఎల్కతుర్తిలో జూనియర్ కాలేజీ కి కృషి చేస్తామని అన్నారు. ఈ జనాన్ని చూస్తుంటే 95 నుంచి 110 సీట్లకు నాంది హుస్నాబాద్ కావాలని ఇంత పెద్ద సంఖ్యలో జనం వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఊహించలేదని ఈ జన సందోహం చూస్తుంటే సంతోషం కలుగుతుందని మళ్లీ రైతు ప్రభుత్వాని గెలిపించి ఆశీర్వదించాలని ప్రజా ఆశీర్వాద సభ ద్వారా సీఎం కేసీఆర్ కోరారు. అనంతరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు సభా వేదికగా బీ ఫారం అందజేశారు.



Next Story

Most Viewed